MBBS student suicide in Nizamabad : నిజామాబాద్ జిల్లాలోని వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వసతి గృహంలోని తన గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన విద్యార్థులు వార్డెన్‌కు సమాచారం అందించారు. అనంతరం కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విద్యార్థి మృతిపై కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై తోటి విద్యార్థులను, కళాశాల యాజమాన్యాన్ని ఆరా తీశారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన హర్ష.. నిజామాబాద్ జిల్లాలోని వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఇవాళ పరీక్షకు హాజరు హర్ష హాజరు కాలేదు. ఏమైందోనని వసతి గృహానికి వెళ్లి చూసేసరికి తన గదిలో ఉరేసుకుని కనిపించాడు. వెంటనే తోటి విద్యార్థులు హాస్టల్ వార్డెన్‌కు సమాచారం అందించగా వారు పోలీసులకు ఫోన్ చేశారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులకు.. హర్ష అనారోగ్య సమస్యల వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటాని భావిస్తున్నట్లు తోటి విద్యార్థులు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు వైద్య విద్యార్థి మృతిపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. హర్ష మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి.