కశ్మీర్‌లో ఇద్దరు తెలుగు జవాన్ల వీరమరణం జమ్మూకశ్మీర్ మాచిల్ సెక్టార్... కాల్పులతో మరోసారి దద్దరిల్లింది. చొరబాటుకు యత్నించిన ముష్కరులను అడ్డుకునే క్రమంలో ఆదివారం ఎదురుకాల్పులు చోటుచేసుకోగా... తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. ప్రాణాలు కోల్పోయిన వీర సైనికుల్లో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్‌పల్లికి చెందిన మహేశ్, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా రెడ్డి వారి పల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్ రెడ్డి ఉన్నారు.
కాల్పులకు తెగింపు...
శనివారం అర్ధరాత్రి కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంట అనుమానాస్పద కదలికలను గుర్తించి సైన్యం గాలింపు చేపట్టింది. ఆ సమయంలో ఉగ్రవాదులు ఏకపక్షంగా కాల్పులకు తెగించారని సైనిక ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అనంతరం సైన్యం ఎదురుకాల్పులకు దిగింది. ఆ ఘటనలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారని.... ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారని వివరించింది. ముష్కరుల నుంచి ఒక ఏకే రైఫిల్‌తో పాటు రెండు బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు.
రెండేళ్ల క్రితమే వివాహం...
ఎదురుకాల్పుల్లో మృతి చెందిన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్‌పల్లి చెందిన మహేశ్‌కు రెండేళ్ల క్రితమే వివాహమైంది. గత డిసెంబర్‌లో స్వగ్రామానికి వచ్చిన మహేశ్ అదే నెలలో తిరిగి విధులకు బయలుదేరారు. ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలన్న లక్ష్యంతో పట్టుదలతో చదివి 2014-15లో ఉద్యోగానికి ఎంపికయ్యారు. మహేశ్ మరణ వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ బాగోగులు చూసే కొడుకు దూరమయ్యాడని ఆవేదన చెందారు.
మరో జవాన్...
కశ్మీర్ ఎదురుకాల్పుల్లో నేలకొరిగిన చిత్తూరు జిల్లా రెడ్డి వారి పల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్ రెడ్డి 18 ఏళ్లుగా మద్రాస్ రెజిమెంట్‌లో సైనికుడిగా పనిచేస్తున్నారు. హవల్దార్‌గా పనిచేస్తూ కమెండో శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రవీణ్‌కుమార్‌కు భార్య రజిత, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఇదీ చదవండి:అనురాగ్ శర్మ పదవీ కాలం మరో మూడేళ్లు పొడిగింపు