స్థానిక సంస్థ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్, మహబూబ్‌నగర్ అభ్యర్థులపై ఉత్కంఠ వీడింది. రెండు స్థానాల్లో సిట్టింగ్ అభ్యర్థులే బరిలోకి దిగనున్నారు. బండ ప్రకాష్ ఎమ్మెల్సీగా ఎన్నికైనందున.. ఆ స్థానంలో కల్వకుంట్ల కవిత రాజ్యసభకు వెళ్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఒకవేళ కవిత రాజ్యసభకు వెళ్తే ఆకుల లలిత ఎమ్మెల్సీగా పోటీ చేస్తారని తెరాసలో చర్చ జరిగింది. అయితే చివరకు కవిత (Nizamabad mlc candidate) మరోసారి శాసనమండలికే వెళ్లేలా తెరాస నాయకత్వం నిర్ణయం తీసుకుంది.
మహబూబ్‌నగర్‌లోని రెండు స్థానాల్లో కసిరెడ్డి నారాయణరెడ్డిని యథాతథంగా కొనసాగించిన.. కూచుకుంట్ల దామోదర్ రెడ్డిని మారుస్తారని ప్రచారం జరిగింది. దామోదర్‌రెడ్డి స్థానంలో గాయకుడు సాయిచంద్ పేరును పరిశీలించారు. కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరిన దామోదర్‌రెడ్డి తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో.. ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వాలని తెరాస నిర్ణయించింది. కవిత, దామోదర్ రెడ్డి రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత ఎన్నికైన సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ బిగాల.. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కవిత నివాసానికి చేరుకుని అభినందనలు తెలియజేశారు.
గత లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి కల్వకుంట్ల కవిత పోటీ చేసి.. భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఓడిపోయారు. అనంతరం నిజామాబాద్ స్థానిక సంస్థ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కవిత.. ఘన విజయం సాధించారు. జనవరి 4న పదవీ కాలం పూర్తికానుంది. మళ్లీ అదే స్థానం నుంచి కవిత బరిలో నిలుస్తున్నారు.
నామినేషన్ దాఖలు..
తెరాస అభ్యర్థులు పలువురు నేడు నామినేషన్లు సమర్పించారు. రంగారెడ్డి కలెక్టరేట్లో శంభీపూర్ రాజు, మహేందర్‌రెడ్డి నామినేషన్ వేశారు. కార్యక్రమంలో మంత్రులు సబిత, మల్లారెడ్డి, తెరాస ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ కలెక్టరేట్లో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి విశ్వ నారాయణకు నామపత్రాలు సమర్పించారు. కాగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రెండు నామినేషన్లు వేయగా... ఆయన తరఫున మరో రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి ఒక సెట్, మంత్రి సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి మరో సెట్ నామినేషన్లను వేశారు. అనంతరం జడ్పీ చైర్మన్లు కుసుమ జగదీష్, పాగాల సంపత్ రెడ్డి, ఛైర్పర్సన్లు గండ్ర జ్యోతి ఒక సెట్, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌లు మరో సెట్ చొప్పున పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తరఫున నామినేషన్లు వేశారు. ఖమ్మం స్థానిక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి తాతా మధు తొలిసెట్ నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి పువ్వాడ అజయ్‌తోపాటు తెరాస ఎమ్మెల్యేలు రాములునాయక్, హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్‌కు నామపత్రాలు అందజేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్..
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ( Local Bodies Quota MLC Elections) నోటిఫికేషన్ విడుదలైంది. స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా... తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి ఈనెల 23 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. ఉపసంహరణకు 26 వరకు గడువును నిర్ణయించారు. డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించి... 14న ఓట్లను లెక్కిస్తారు.
- ఖమ్మం- తాత మధు
- ఆదిలాబాద్- దండే విఠల్
- మహబూబ్‌నగర్- కూచుకుంట్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి
- రంగారెడ్డి - శంభీపూర్‌రాజు, పట్నం మహేందర్ రెడ్డి
- వరంగల్- పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
- నల్గొండ- ఎం.సి. కోటిరెడ్డి
- మెదక్- యాదవ రెడ్డి
- కరీంనగర్ - ఎల్ రమణ, భానుప్రసాదరావు
- నిజామాబాద్- కల్వకుంట్ల కవిత
ఇదీ చదవండి:MLC elections in telangana 2021: ఆరుగురు తెరాస అభ్యర్థులు ఏకగ్రీవం