Libraries Are Struggling Lack Of Funds: విజ్ఞాన నిలయాలుగా పేర్కొంటున్న గ్రంథాలయాలు నిధుల కొరతతో కనీస మౌలిక వసతుల కల్పనకు ఆమడదూరంలో ఉంటున్నాయి. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అవసరమైన కొత్త పుస్తకాలను అందించలేకపోతున్నాయి. ఈ-గ్రంథాలయాలుగా సాంకేతికను అందిపుచ్చుకోలేని దుస్థితి కొనసాగుతోంది. ప్రజలు చెల్లించే ఆస్తిపన్ను నుంచి గ్రంథాలయ సెస్సును ఇవ్వడం లేదు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఇప్పటి వరకు సుమారు రూ.4.23 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోవడం గమనార్హం.
ఆస్తిపన్నులో 8 శాతం:పంచాయతీలు, నగర, పురపాలికల్లో ఏటా వసూలు చేసే ఆస్తిపన్నులో ప్రత్యేకంగా 8 శాతం గ్రంథాలయ సెస్సుగా తీసుకుంటారు. వీటిని జిల్లా గ్రంథాలయ సంస్థ ఖాతాకు జిల్లా పంచాయతీ శాఖ, నగర, పురపాలికలు జమ చేయాల్సి ఉండగా.. పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడంతో పఠనాలయాలకు నిధుల కొరత ఏర్పడుతోంది. ఈ సెస్సు నిధులతోనే అభివృద్ధి పనులు, మరమ్మతులు, అవసరమైన మేరకు శాశ్వత భవనాలు, గదుల నిర్మాణం చేపట్టగలరు.
దిన, వార, మాస పత్రికలు, కుర్చీలు, టేబుళ్లు, అట్టలు, పార్ట్‌టైం ఉద్యోగుల జీతాలు, విద్యుత్తు బిల్లులు చెల్లించొచ్చు. ఇందుకోసం సెస్సు రూపేణా గ్రామపంచాయతీల ద్వారా సుమారు రూ.3.50 కోట్లు రావల్సి ఉండగా.. కేవలం 54 శాతం మాత్రమే జమ చేస్తున్నారు. పురపాలికల ద్వారా సుమారు రూ.2 కోట్లు రావల్సి ఉంటే.. ఇప్పటి వరకు 75 శాతం అందజేశారు.
శాశ్వత భవనాలు అవసరం:ఉభయ జిల్లాల్లో పూర్తిస్థాయిలో శాశ్వత భవనాలు లేవు. నిజామాబాద్‌లో ఇంకా ఐదు శాఖాగ్రంథాలయల(నందిపేట్, రుద్రూరు, భీమ్‌గల్, జిల్లాకేంద్రం దుబ్బ, న్యూ ఎన్జీవోస్ కాలనీ)కు ఈ సమస్య ఉంది. ఇందులో భీమ్‌గల్ భవనం శిథిలావస్థకు చేరడంతో అద్దె గదిలోకి మార్చారు. గ్రామీణ గ్రంథాలయాలకు కూడా శాశ్వత భవనాలు అవసరం. దుబ్బ ప్రాంతంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో 5 వేలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు.