MP Arvind Bond Papers on KTR Twitter : నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు అంశం మరోమారు తెరపైకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కుమార్ పసుపు రైతులకు రాసినట్లు ఉన్న ఓ బాండ్ పేపర్‌ను తాజాగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విటర్లో షేర్ చేశారు. దానికి 'పసుపు బోర్డు ఇస్తామంటూ రాసిన ఈ బాండ్ పేపర్లను గుర్తు పట్టగలరా' అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.
పార్లమెంట్ ఎన్నికల సమయంలో పసుపు బోర్డును ఇస్తామని బీజేపీ బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చిందని.. ఆ తర్వాత మర్చిపోయిందని కేటీఆర్ ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. ఇది రైతులను అత్యంత దారుణంగా అవమానించటమే అని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన బీజేపీ.. ఆ తరువాత రైతులు ఎన్నో ఉద్యమాలు చేసినా పసుపు బోర్డు ఇవ్వకపోవటం దారుణమని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహానికి పసుపు రైతులు తగిన బుద్ధి చెబుతారని కేటీఆర్ విమర్శించారు.
Turmeric board in Nizamabad: నిజామాబాద్‌లో పసుపు బోర్డుపై రాజకీయం చాలా ఏళ్లుగా నడుస్తోంది. ఇది వరకే అక్కడ పోటిపోటిగా ఫ్లేక్సీలు ఏర్పాటు.. నేతలకు పసుపు రైతుల నుంచి నిరసన సెగలు.. ఇలా చాలా జరిగాయి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. నిజంగా చెప్పలంటే నిజామాబాద్ రాజకీయాల్లో పసుపు బోర్డు అంశంతో కొంత ఓటు బ్యాంక్ ముడిపడి ఉందని చెప్పొచ్చు. అందుకే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి పసుపు రైతులను ప్రసన్నం చేసుకోనేందుకు రాజకీయ నేతలు పోటిపడతారు.