TU VC vs EC Controversy Latest Update : నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ కుర్చీల విషయంలో మళ్లీ వివాదం మొదలైంది. అయితే పరిపాలన భవనంలోని రిజిస్ట్రార్ ఛాంబర్‌కు ఉదయమే సెక్యూరిటీ తాళం వేశారు. వీసీ ఆచార్య రవీందర్ గుప్తా సెక్యూరిటీ అధికారికి ఫోన్ చేసి రిజిస్ట్రార్ గదికి తాళం వేయించినట్లు తెలిసింది. ఉదయమే యూనివర్సిటీకి వచ్చిన వీసీ రవీందర్.. రిజిస్ట్రార్ ఛాంబర్‌కు తాళం వేయించినట్లు తెలియడంతో పాలక మండలి నియమించిన రిజిస్ట్రార్ యాదగిరి కామర్స్ కళాశాలలోని డిపార్ట్మెంట్లో కూర్చున్నారు.
దీనికి సంబంధించి వీసీ రవీందర్ గుప్తా సర్కులర్ జారీ చేశారు. యూనివర్సిటీలోని అన్ని ఫైళ్లను అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/ఫైనాన్స్ ఆఫీసర్ ద్వారా రూట్ చేసి, కౌంటర్ సైన్ చేయాలి అని సంబంధిత యూనివర్సిటీ అధికారులందరికీ తెలంగాణ వర్సిటీ వీసీకి ముందస్తు సమాచారం లేకుండా ఏ ఒక్క ఫైల్‌ను కూడా అనధికార వ్యక్తికి అందజేయరాదని సమాచారం. పైన పేర్కొన్న ఉల్లంఘన వైస్ ఛాన్సలర్ దృష్టికి వస్తే నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్య ప్రారంభించబడుతుందని వీసీ రవీందర్ గుప్తా సర్కులర్ జారీ చేశారు.
అయితే రిజిస్ట్రార్ గదికి తాళం వేసిన ఘటనపై స్పందించారు. వీసీ రవీందర్ గుప్తా తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ.. రిజిస్ట్రార్ రూమ్‌కి తాళం వేయించలేదని పేర్కొన్నారు. ఒకవేళ తాళం వేస్తే డోర్‌కి నోటీసులు అంటించి సీజ్ చేసే వారిమని వెల్లడించారు. పాలకమండలి నియమించిన రిజిస్ట్రార్ యాదగిరి దగ్గర ఆర్డర్ కాపీ లేనందున ఆ బాధ్యతలను ఏవో ఖాదర్‌కి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు.