Inspirational story of Bodhan retired teacher: మాది నిజామాబాద్ జిల్లా బోధన్. నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉంటే.. మావారు వెంకట్రావు నిజాం షుగర్స్‌లో ఉద్యోగి. ఆర్థికంగా ఏ ఇబ్బందీ లేకున్నా మాకు పిల్లలు లేని లోటు ఉండేది. దత్తత ప్రయత్నాలు చేసినా అవేమీ సాధ్యపడలేదు. పాతికేళ్ల క్రితమే రిటైర్ అయ్యాను. ఆ వచ్చిన డబ్బుతో ఓ ఇల్లు కొన్నా. పింఛన్ వచ్చేది. విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయన మరణించారు.
అంతవరకూ తోబుట్టువుల పిల్లలే నా పిల్లలు అనుకున్నా. వాళ్లొచ్చినప్పుడు తెగ సంబరపడేదాన్ని. వాళ్లూ ప్రేమగా ఉండేవారు. కానీ ఆ ప్రేమలన్నీ.. నా ఆస్తి చుట్టూ తిరగడం నచ్చలేదు. ఇవన్నీ చూసి విసిగిపోయి.. ఇంటిని ఏదైనా సంస్థకు విరాళంగా ఇవ్వాలనుకున్నా. ఇలా ఆలోచిస్తుండగా మా ఉపాధ్యాయులు పడుతున్న బాధలే నన్ను కదిలించాయి.
విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకి సొంత భవనం లేదని తెలుసుకున్నా. ఆ సంఘానికి ఇంటిని రాసిస్తే మున్ముందు ఎందరికో సేవలు అందుతాయని గట్టిగా నమ్మా. నా తర్వాత ఇల్లు సంఘానికి చెందేలా ఏడాదిన్నర కిందటే రిజిస్ట్రేషన్ చేయించా. ఆ ఇంటి విలువ ప్రస్తుతం రెండు కోట్ల రూపాయలు. ఇది తెలిశాక బంధువులు ఇటువైపు రావడమే మానేశారు.
ఆ అవమానం తప్పించాలని.. ఓసారి దగ్గరి బంధువొకరు చనిపోతే అంత్యక్రియలకు వెళ్లా. ఇంటికి కాస్త దూరంగా శవాన్ని ఉంచారు. ఏంటని ఆరా తీయగా.. ఆ ఇంటి యజమాని అనుమతించలేదని తెలిసింది. ఇంకోసారి పరిచయస్థులొకరు చనిపోతే.. వారుండే ఇంటికి దూరంలో అంత్యక్రియలకు కావాల్సిన పనులు చేస్తున్నారు. అద్దె ఇళ్లలో ఉన్నవారికి ఈ బాధలు తప్పడం లేదని అర్థమైంది.