Telangana University EC Meeting in Hyderabad: తెలంగాణ విశ్వవిద్యాలయంలో గందరగోళం తొలగడం లేదు. వరుసగా రిజిస్ట్రార్ల మార్పు కొనసాగుతూనే ఉంది. రెండు రోజుల కిందట ప్రొఫెసర్ నిర్మలాదేవి టీయూ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టగా.. ఈరోజు జరిగిన వర్సిటీ పాలక మండలి సమావేశంలో మళ్లీ ఆచార్య యాదగిరిని కొనసాగిస్తూ తీర్మానం చేశారు. దీంతో వర్సిటీలో మరోసారి గందరగోళం నెలకొంది. తానంటే తాను రిజిస్ట్రార్ అని చెప్పుకునే పరిస్థితి తలెత్తింది.
మూడు కీలక తీర్మానాలు చేసిన పాలక మండలి: ఇదిలా ఉండగా.. ఈ రోజు హైదరాబాద్‌లోని రూసా భవనంలో తెలంగాణ వర్సిటీ పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 10 మంది ఈసీ సభ్యులు పాల్గొన్నారు. కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిత్తల్ అధ్యక్షతన జరిగిన ఈ పాలక మండలి సమావేశంలో మూడు కీలక తీర్మానాలు చేశారు. ప్రొ.యాదగిరిని తిరిగి రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టాలని మండలి తీర్మానం చేసింది. పాలక మండలి అనుమతి లేకుండా రిజిస్ట్రార్లుగా కొనసాగిన శివశంకర్, విద్యావర్ధిని, నిర్మలా దేవిలపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఈసీ తీర్మానించింది. మూడో తీర్మానంగా తెలంగాణ యూనివర్సిటీలో అనుమతి లేకుండా చేసిన నియామకాలు, అక్రమాలపై విచారణ కోసం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ, ఏసీబీ డీజీ, నిజామాబాద్ సీపీకి ఫిర్యాదు చేయాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12న మరోసారి సమావేశమవ్వాలని పాలక మండలి నిర్ణయించింది.