ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు దమ్ బిర్యానీ హోటళ్లు వందల సంఖ్యలో ఉండేవి. ప్రతి ఒక్కరూ ఈ రకాన్ని ఇష్టంగా తినేవారు. తాజాగా మండి బిర్యానీ పరిచయమైంది. యువత దీనికే ప్రాధాన్యం ఇస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ప్రత్యేకంగా లభించే ఈ వంటకం ఇంతకు ముందు హైదరాబాద్‌లో మాత్రమే దొరికేది. ఇప్పుడు జిల్లాకేంద్రాల్లో మండి పేరుతో హోటళ్లు ఏర్పాటయ్యాయి. అదేవిధంగా కొన్ని హోటళ్లలో మట్టి పాత్రలోనూ ‘బిర్యానీ’ రుచి చూపిస్తున్నారు. దీన్నే కుండ బిర్యానీగా పిలుస్తున్నారు. వీటికి తోడు బకెట్ బిర్యానీ పేరిట హోటళ్లు వెలిశాయి. కుటుంబానికి సరిపడేంతా బకెట్‌లో ప్యాక్ చేసి ఇస్తున్నారు.
ఆరగిస్తున్న చిన్నారులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిత్యం సుమారుగా ఐదు టన్నుల కోడి మాంసాన్ని బిర్యానీ కోసం వాడుతున్నట్లు ఓ వ్యాపారి పేర్కొన్నారు. కేవలం చికెన్ కోసమే హోటళ్ల నిర్వాహకులు రోజుకి రూ.10 లక్షలు వెచ్చిస్తుండగా.. రూ.1.20 కోట్లకుపైగా వ్యాపారం జరుగుతోందని అంచనా.
ప్రత్యేక సిబ్బంది
వినాయక్‌నగర్‌లోని ఓ హోటల్‌లో రోజుకి 120 డోర్ డెలివరీలు జరుగుతాయి. ఇందులో బిర్యానీ ఆర్డర్లు 80కు పైగా ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఆర్డర్ల ప్యాకేజీ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.
రాయితీలు
రెండు జిల్లా కేంద్రాల్లో ఫుడ్ డెలివరీ సంస్థలు అందుబాటులో ఉన్నాయి. సగటున రోజుకి 12-14 వేల డోర్ డెలివరీలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులోనూ 65 శాతం బిర్యానీలే డెలివరీ చేస్తున్నట్లు ఓ సంస్థలో పనిచేసే ఉద్యోగి తెలిపారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు పూర్తిగా ఈ ఆర్డర్లే వస్తున్నట్లు పేర్కొన్నారు. రాయితీలు ప్రకటిస్తుండటంతో వీటికి ఆదరణ పెరుగుతోంది.
ప్రత్యేక ఏర్పాట్లు
కరోనా కారణంగా హోటళ్ల నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిబ్బంది విధిగా మాస్కు ధరించేలా చూస్తున్నారు. హోటల్ ప్రవేశం దగ్గరే శరీర ఉష్ణోగ్రత పరిశీలిస్తున్నారు. డైనింగ్ టేబుళ్ల మధ్య స్థలం వదిలేస్తున్నారు. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నారు.