మా గ్రామాన్ని విలీనం చేస్తే ఎన్నికలను బహిష్కరిస్తాం : గ్రామస్థులు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని నర్సాపూర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేయడాన్ని గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే జరిగితే పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తామని తీర్మానం చేశారు. 2004లో ఎన్నికలను కూడా తాము బహిష్కరించామని గుర్తు చేశారు.నర్సాపూర్ గ్రామంలో చాలామంది ఉపాధి హామీ పనులపైనే ఆధారపడి ఉన్నారు. ఇప్పుడీ గ్రామాన్ని బోధన్ మున్సిపాలిటీలో విలీనం చేస్తే ఉపాధి హామీ వర్తించదు. అందుకే విలీనం వద్దని నిరసనకు దిగారు.
ఇన్నాళ్లు తమ సమస్యలపై స్పందించని అధికారులు.. ఇప్పుడెలా నిర్ణయం తీసుకుంటారని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో నీటి కొరత తీర్చాలని అధికారులను కోరితే స్పందించలేదని వాపోయారు. పలుమార్లు అడిగి విసుగు చెంది తామే చందాలు వేసుకుని బోర్లు వేసుకున్నామని తెలిపారు.
తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపకుండా.. సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని నర్సాపూర్ వాసులు జిల్లా కలెక్టర్‌ను కోరుతున్నారు.