నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి భవనంపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఆస్పత్రి వర్గాలు జిల్లా కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించినట్లు తెలుస్తోంది. సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న కలెక్టర్ నారాయణ రెడ్డి… మృతుడు ఎవరో తెలియదని ఆస్పత్రికి చెందిన పేషెంట్ కాదని ఓ ప్రకటన విడుదల చేశారు.
కలెక్టర్‌ను తప్పుదోవపట్టించిన ఆస్పత్రి వర్గాలు!
కొవిడ్ సోకిన ఓ వ్యక్తి నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిపై నుంచి దూకి చనిపోయిన విషయంలో ఆస్పత్రి వర్గాలు జిల్లా కలెక్టర్‌ను తప్పుదోవపట్టించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మృతుడు అదే ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు తెలిసింది. కానీ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు దాచిపెట్టినట్లు తెలుస్తోంది.
nizamabad hospital
మృతుడు మోపాల్ మండలం మొదక్ పెల్లికి చెందిన హుస్సేన్‌గా నిర్ధరణ అయింది. బాధితుడు ఈనెల 25న ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి.. ఐదో వార్డులో చికిత్స పొందుతున్నట్లు తేలింది. కొవిడ్ తగ్గుతుందో లేదన్న భయాందోళనతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆత్మహత్య వివాదం ఎక్కడ తమ మీదకు వస్తుందోనని కేస్ షీట్ సైతం దాచిపెట్టిన ఆస్పత్రి పెద్దలు... కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.