నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం రాకాసిపేట గ్రామంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గంగ తెప్పోత్సవం నిర్వహించారు. గంగతెప్పోత్సవం తమ కుల పండుగ అని స్థానిక గంగపుత్ర సంఘం వెల్లడించింది. అందుకే ఏటా శ్రావణమాసం సందర్భంగా కుల బాంధవులతో బెల్లాల్ చెరువు వద్ద వనభోజనాలు నిర్వహించడం ఆనవాయితీ అని స్పష్టం చేసింది. గంగపుత్రులకు ఎలాంటి కష్టాలు రాకుండా వర్షాలు సమృద్ధిగా కురవాలని... చెరువులు నిండుకుండలా ఉండాలని గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించినట్లు సంఘం నేత కముట్ల గంగరాం గంగపుత్ర తెలిపారు.
గంగాదేవీ కరుణతో...
గంగాదేవీ కరుణతో గంగపుత్రులకు పుష్కలమైన మత్స్య సంపద లభించాలని.. పంట పైర్లు , పాడి పశువులు, రైతులు సుభిక్షంగా ఉండాలని బోనం సమర్పించినట్లు సంఘం నేత బొంతల సాయిలు గంగపుత్ర స్పష్టం చేశారు. తమ చెరువులు, నదులు, వాగులు, కుంటల్లో నీరు బాగా ఉండాలని గంగమ్మ తల్లిని కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. బెల్లాల్ చెరువు మంచి నీటి సరస్సు అని.. ఈ చెరువు నీరు తాగితే ఆయురారోగ్యాలతో ఉంటామని గ్రామస్తులు అన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి ఈ చెరువు నీరే ఆధారమని... నల్లాల ద్వారా ఇంటింటికీ మంచి నీరు అందుతుందన్నారు.