తెలంగాణ

telangana

ETV Bharat / state

Hail Rains in Telangana: అకాల వర్షం.. అంతా కకావికలం.. - తెలంగాణలో ఆకాల వర్షాలు

Hail Rains Damaged Crops In Telangana: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షం, ఈదురు గాలులు, వడగళ్ల వాన.. రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. ప్రధానంగా కోతకు వచ్చిన వరి పంటకు వడగళ్ల వాన తీవ్ర నష్టం కలిగించింది. ధాన్యం నేలరాలి రైతులు లబోదిబోమంటున్నారు. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. మొక్కజొన్న, ఇతర వాణిజ్య పంటలు.. నేల పాలయ్యాయి.

Rains
Rains

By

Published : Apr 23, 2023, 7:37 AM IST

రైతన్నకు తీరని నష్టాన్నే మిగిల్చిన.. ఆకాల వర్షాలు

Hail Rains Damaged Crops In Telangana:: రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగళ్ల వానలు రైతులను నట్టేట ముంచాయి. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. పొందుర్తిలో పిడుగుపడి బాలలింగం అనే వ్యక్తికి చెందిన 13 గొర్రెలు చనిపోయాయి. నిజామాబాద్ జిల్లా ఇందల్​వాయి మండలం గన్నారం, ధర్పల్లిలో.. కల్లాల్లో ధాన్యం తడిసిముద్దయింది. చేతికి వచ్చిన పంట నోటికి రాకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ దేవాలయం వద్ద ధ్వజ స్తంభం నేలకొరిగింది. చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా అకాలంగా కురిసిన భారీ వర్షాలతో తడిసిపోయిన ధాన్యాన్ని కొని.. ప్రభుత్వమే రైతన్నలను ఆదుకోవాలని కన్నీరు పెట్టుకున్నారు.

వడగళ్ల వానతో రైతులకు తీరని నష్టం: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో.. వడ్లు, మక్కలు, పొద్దు తిరుగుడు గింజలు.. అకాల వర్షానికి తడిసి ముద్దయ్యాయి. వర్షం ధాటికి వరద నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ, చిగురుమామిడి మండలాల్లో కూడా సాయంత్రం వేళ మోస్తరు వర్షం కురిసింది. జగిత్యాల జిల్లాలో వడగళ్ల వాన రైతులకు నష్టం కల్గించింది. ధాన్యంతో పాటు.. మామిడి కాయలు రాలిపోయాయి. మల్యాల మండలం కొండగట్టు సమీపంలో తాటి చెట్టుమీద ఉన్న మల్లేశం అనే గీత కార్మికుడిపై.. పిడుగుపడి గాయపడ్డాడు. అతన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. మేడిపల్లి మండలం గోవిందారంలో పిడుగు పడి 20 గొర్రెలు మృతి చెందాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో వడగళ్ల వర్షంతో.. పొట్ట కొచ్చిన ధాన్యం నేలరాలింది. నెల రోజుల కిందట కురిసిన వర్షాలకే కలిగిన నష్టాన్ని పూడ్చుకోలేకపోయామని రైతులు వాపోతున్నారు.

వర్షానికి తడిసిముద్దయిన ధాన్యం: కరీంనగర్ జిల్లా చొప్పదండి, రామడుగు మండలాల్లో వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో కురిసిన వర్షానికి నిల్వ చేసిన ధాన్యం కొట్టుకుపోయింది. పలు గ్రామాల్లో వడగళ్లతో కోతదశకు చేరుకున్న ధాన్యం పొలాల్లోనే రాలిపోయింది. పెద్దపల్లి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం.. రైతులను ఇబ్బంది పెట్టింది. సుల్తానాబాద్, ఎలిగేడు, జూలపల్లి, కాల్వ శ్రీరాంపూర్, ఓదెల మండలాల్లో పంటలకు సైతం భారీ నష్టం వాటిల్లింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రకు.. అకాల వర్షం ఇబ్బందులకు గురి చేసింది. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మడిపల్లి శాంతినగర్‌లో భట్టి విక్రమార్క బస చేసిన చోటనే ఈదురుగాలులకు టెంట్‌ కూలిపోయింది. నేలవాలిన టెంట్లను.. తడిచిన భోజన పదార్థాలను భట్టి పరిశీలించారు. టెంట్‌ కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది.

కన్నీరు పెట్టుకున్న అన్నదాతలు: సూర్యాపేట జిల్లా నాగారంలో అకాల వర్షానికి.. ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. ఆకారపు వెంకన్న కౌలు రైతుకు చెందిన పంట.. సూరయ్యకుంటలోకి కొట్టుకుపోవడంతో.. తన పిల్లలతో కలిసి నీటిలో ఉన్న ధాన్యాన్ని.. బయటకు ఎత్తిపోశాడు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. జనగామ జిల్లా బచ్చన్నపేట, రఘునాథపల్లి మండలాల్లో భారీ వడగండ్ల వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా చిరుజల్లులు పడ్డాయి. వడగండ్ల వాన కురవడంతో తీవ్ర పంట నష్టం వాటిల్లిందంటూ.. అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు, వడగండ్ల వానలు.. తమకు కడగండ్లనే మిగిల్చాయని అన్నదాతలు.. కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ అభ్యర్థిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details