గులాబ్ తుపాన్ ప్రభావంతో(Gulab cyclone effect) మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వానలతో జలాశయాలకు వరద వచ్చి చేరుతోంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది(sriram sagar project water level). ఎగువ భాగాన కురుస్తున్న వర్షాలతో జలాశయంలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 3,96,000 క్యూసెక్కుల నీరు చేరుతుండగా... 4,49,800 క్యూసెక్కుల నీటిని 33 ప్రధాన గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1,088.9అడుగుల మేర నీటి మట్టం ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
సాగర్‌కు వరద
నాగార్జునసాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది(Nagarjuna sagar water level). జలాశయం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 57,557 క్యూసెక్కులుగా ఉంది. రెండు క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుతం 589.9 అడుగులుగా ఉంది. జలాశయం గరిష్ఠ నీటినిల్వ 312.0405 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటినిల్వ 311.74 టీఎంసీలుగా నమోదైంది.