Harish Rao Comments on Congress Manifesto : వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. 3 గంటల విద్యుత్ సరిపోతుందా అని మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ప్రశ్నించారు. రైతు బంధు, రైతు బీమా ఇచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలను ఆదుకుంటుందని గుర్తు చేశారు. రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2000 చేశామని తెలిపారు. సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు రూ.3,000 ఇవ్వనున్నట్లు చెప్పారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు.
కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మూడు గంటల కరెంటును అనుమతించినట్లే : హరీశ్‌రావు
Harish Rao Fires on Congress :రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని హరీశ్‌రావు పేర్కొన్నారు. మరోసారి బీఆర్ఎస్ గెలిస్తే ఎకరానికి రూ.16,000 ఇవ్వనున్నట్లు చెప్పారు. కానీ ఎన్ని ఎకరాలున్నా రూ.15,00 ఇస్తామని కాంగ్రెస్ అంటుందని అన్నారు. హస్తం పార్టీ మేనిఫెస్టోను నమ్మితే మోసపోతామని.. వారు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శించారు. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని.. ఆ పార్టీకి ఎందుకు ఓటేశామని అక్కడి ప్రజలు బాధపడుతున్నారని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ- బీఆర్ఎస్ కలవవని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.