Harish Rao Comments on Congress in Nizamabad Tour : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంత్రి హరీశ్‌రావు (Harish Rao) పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తొలుత కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. రూ.26 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యార్థులకు గొడ్డు కారంతో అన్నం పెడుతుంటే.. తెలంగాణలో మాత్రం కేసీఆర్ సర్కార్ చిన్నారులకు మమకారంతో అల్పాహారం అందిస్తోందని హరీశ్‌రావు వెల్లడించారు.
కేంద్రం, మహారాష్ట్రలో బీజేపీ సర్కార్ ఉన్నా.. నాందేడ్ ఆసుపత్రిలో మందులు ఎందుకు లేవని హరీశ్‌రావు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో జాకీ పెట్టి లేపినా భారతీయ జనతా పార్టీ లేచే పరిస్థితి లేదని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని.. తప్పుడు సర్వేలతో హస్తం పార్టీ.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. టికెట్ల పంపిణీ చేయలేకపోతున్న కాంగ్రెస్.. అధికారంలోకి వస్తే ఏం అభివృద్ధి చేస్తుందని హరీశ్‌రావు నిలదీశారు.
Harish Rao visit to Nizamabad District Today : అనంతరం హరీశ్‌రావు నిజామాబాద్ జిల్లా (Nizamabad District) దర్పల్లి మండల కేంద్రంలో రూ.30 కోట్లతో నిర్మించనున్న.. 100 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ పట్టుపట్టి 100 పడకల ఆసుపత్రిని ఈ ప్రాంతానికి మంజూరు చేయించారని ఆయన తెలిపారు. బాజిరెడ్డిని మరోసారి గెలిపించి హ్యాట్రిక్ ఇవ్వాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పాలనలో ఆసుపత్రిలో సూది ఉంటే మందు లేని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. బీడీ పరిశ్రమను దెబ్బతీయడానికే బీడీ కట్టపై జీఎస్టీ వేశారని.. మహిళా బీడీ కార్మికులకు ఫించన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.