నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు పంటలు వేసేందుకు పొలాలను సిద్ధం చేస్తున్నారు. యాసంగిలో దొడ్డు రకాలు, వానాకాలంలో సన్న, దొడ్డు రకాలు పండిస్తారు. ఏ రకం వడ్లకైనా ప్రభుత్వ మద్దతు ధర ఒక్కటే కావటం వల్ల రైతులు సన్న బియ్యం కంటే దొడ్డురకాలను సాగుచేసేందుకు మొగ్గుచూపుతున్నారు.
గిట్టుబాటు ధర నిర్ణయిస్తేనే...
తాజాగా ప్రభుత్వం సన్నరకాలను సాగుచేయాలని చెబుతుండడం వల్ల నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. 2019–21లో వరి ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 1,835 కాగా... మిల్లర్లు సన్నవడ్లను రూ. 2వేల దాకా కొన్నారు. సన్నాలనే ఎక్కువగా పండిస్తే మిల్లర్లు రేటు తగ్గిస్తారనడంలో అనుమానం లేదని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సన్నాలకు రాష్ట్ర సర్కారు ముందుగా గిట్టుబాటు ధర నిర్ణయించాలని... అప్పుడే వాటిని సాగుచేస్తామని రైతులు తేల్చి చెబుతున్నారు.
ఏం చేయాలో సమజైతలేదు…
"ఈసారి మక్కలు వేయద్దని సర్కార్ చెప్తాంది. పత్తి సాగు చెద్దామంటే ఎర్ర నేలలో దిగుబడి రాదు. ప్రభుత్వం పెట్టిన నిబంధనతో ఏం చేయాలో సమజైతలేదు. ఈ విషయంలో సర్కారు మరోసారి ఆలోచన చేయాలె. ఎవరి ఇష్టమైన పంట వారు పండించుకునేలా చూడాలె" అంటూ... ఓ రైతు కోరాడు.