నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రీ గ్రామంలో గంగపుత్రులపై గ్రామ అభివృద్ధి కమిటీ బహిష్కరణ విధించింది. వీడీసీ చేస్తున్న బెదిరింపులను ఇటీవలే గంగపుత్ర చైతన్య సమితి సభ్యులు ఆర్డీఓ, డీఎస్పీ, తహసీల్దార్, మత్స్య శాఖ దృష్టికి తీసుకెళ్లామని సంఘం నేతలు వెల్లడించారు. ఫలితంగా అధికారులు గ్రామానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. అనధికారికంగా గ్రామ అభివృద్ధి కమిటీ వ్యవహరిస్తున్న తీరుపై వారిని మందలించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు అధికారులు అవగాహన కల్పించారు. ఫలితంగా గంగపుత్రులపై గ్రామ బహిష్కరణ ఎత్తివేసినట్లు గ్రామ చావిడి వద్ద మైక్ ద్వారా ప్రకటింపజేశారు. కానీ అంతర్గతంగా తమకు గ్రామంలో ఎవరూ సహకరించట్లేదని సంఘం సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే తీరు..
గత నాలుగేళ్లుగా తాము చాలా గ్రామాల్లో మత్స్యకారులపై వీడీసీ బెదిరింపులకు దిగుతోందని చైతన్య సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అల్గోట్ రమేశ్ గంగపుత్ర ధ్వజమెత్తారు. బాల్కొండ నియోజకవర్గంలోని చిట్టాపూర్లోనూ ఏడాదికి రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు మండిపడ్డారు. వీడీసీ చెప్పిన రేటుకే చేపలు విక్రయించాలని హుకుం జారీ చేస్తున్నారని.. తమపై గ్రామ అభివృద్ధి కమిటీ పెత్తనం చెలాయిస్తోందన్నారు. కమిటీ చెప్పిన ధరకే చేపలు విక్రయించాలని.. లేకుంటే సాంఘిక బహిష్కరణ చేస్తామన్నారు. చేపలు గ్రామంలో తప్ప ఇతర ప్రదేశాాల్లో అమ్మకూడదని వీడీసీ చెప్పడమేమిటని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తాము వీడీసీని వ్యతిరేకించినందుకు గ్రామం నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపారన్నారు. తమకు అన్యాయం జరిగినందునే కమిటీపై అధికారులను ఆశ్రయించినట్లు స్పష్టం చేశారు.
త్వరలోనే మానవ హక్కుల కమిషన్కు..