రహదారి విస్తరణ పనుల్లో జాప్యంతో తరచూ ప్రమాదాలు వాహనాల రాకపోకలతో డిచ్‌పల్లి రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ రహదారిని 2 వరుసలుగా మార్చాలని ప్రభుత్వం 2018లో 27 కోట్ల 50లక్షలు మంజూరు చేసింది. మూడేళ్ల పాటు సాగిన పనుల్లో రోడ్డు విస్తరణతోపాటు డివైడర్ నిర్మించారు. రోడ్డు మాత్రమే వేసి విద్యుత్ స్తంభాలు తొలగించలేదు. రాత్రి వేళ స్తంభాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని వాహన దారులు చెబుతున్నారు. డిచ్‌పల్లి నుంచి బోర్గాం వరకు ఉన్న 140 స్తంభాల్లో కొన్ని రోడ్డు మధ్యలోకి, మరికొన్ని రహదారి అంచున ఉండి ప్రమాదాలకు కారణమవుతున్నాయని వాపోతున్నారు.
ప్రమాదాలను నివారించాలి..
ధర్మారం గ్రామంలో మూల మలుపులు అధికంగా ఉన్నాయి. వేగంగా వచ్చే వాహనాలతో పాటు పాదచారులు, ద్విచక్రవాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. రెండున్నరేళ్లలో ధర్మారం ప్రాంతంలోనే 15మంది ప్రాణాలు కోల్పోయారు. స్తంభాలు తొలగించకపోవటం, సెంట్రల్ లైటింగ్ లేక డివైడర్ కనిపించకపోవటంతో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. పనులు పూర్తి చేసి ప్రమాదాలు నివారించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ స్తంభాలు తొలగించి సెంట్రల్ లైటింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: కట్టెల మండిలో భారీ అగ్నిప్రమాదం