రాష్ట్రంలో మళ్లీ మొదలైన వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. రహదారులు మినీ చెరువులుగా దర్శనమిస్తున్నాయి. తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తింది. మొన్నటి వరకు ఉగ్రరూపం దాల్చి.. ఇప్పుడిప్పుడే శాంతిస్తున్న జలాశయాలు మళ్లీ నిండుకుండల్లా మారుతున్నాయి.
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 39,500 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 9 గేట్లు ఎత్తి 24 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 75 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు భారీ వరద వచ్చే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
హెచ్చరికలు జారీ..: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టుకూ భారీగా వరద నీరు వస్తోంది. ప్రాజెక్టులోకి 36,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. అధికారులు రెండు గేట్లు ఎత్తి దిగువన ఉన్న మంజీరా నదిలోకి నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలోనే నదీ పరీవాహక ప్రాంత ప్రజలు, రైతులు, గేదెల కాపరులు నది వైపు వెళ్లరాదని నీటి పారుదల శాఖ అధికారులు హెచ్చరించారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1403.25 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి సామర్థ్యం 15.323 టీఎంసీలుగా ఉంది.
తాలిపేరు 25 గేట్ల ఎత్తివేత..: ఎగువ ప్రాంతంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తోన్న భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 25 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
జంట జలాశయాలకూ వరద..: భాగ్యనగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లకూ భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఉస్మాన్ సాగర్ ఇన్‌ఫ్లో 2,100 క్యూసెక్కులు కాగా.. 6 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి 1,788 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1786.95 అడుగులుగా ఉంది. హిమాయత్‌సాగర్‌కు 450 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. రెండు గేట్ల ద్వారా 330 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1760.70 అడుగులుగా ఉంది.