ఎడతెరిపిలేని వర్షాలు... ఎగువ నుంచి పోటెత్తుతున్న వరదతో గోదావరి బేసిన్ ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఉత్తర తెలంగాణ వర ప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. జూన్ 29వరకు ప్రాజెక్టులోకి చుక్క నీరు చేరలేదు. వర్షాకాలం ప్రారంభానికి ముందు 29టీఎంసీలు నిల్వ ఉంది. ప్రస్తుతం 60టీఎంసీలకు చేరింది. ఆగస్టు 15న 42 టీఎంసీల నీరుండగా.. ఐదు రోజుల్లోనే 18టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చింది. జూన్ 1నుంచి ఇప్పటి వరకు 45టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరింది. ఐదు రోజులుగా ప్రాజెక్టులోకి సరాసరిగా 60వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంటోంది. మరో రెండు రోజులు ఇదే ప్రవాహం ఉండే అవకాశం ఉండటంతో ప్రాజెక్టు నిండుకుండలా మారుతుందని అంచనావేస్తున్నారు.
ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091అడుగులు కాగా.. ప్రస్తుతం 1,083.30 అడుగులకు చేరుకుంది. 90.31టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంటే.. ప్రస్తుతం 61.77 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం 53,330 క్యూసెక్కులు ప్రాజెక్టులోకి వస్తుండగా.... 832 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. మహారాష్ట్రలోని పర్బణీ, పూర్ణ, నాందేడ్ జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే బాబ్లీ గేట్లు తెరిచి ఉండగా.. దాని ఎగువన బాలేగావ్, అంధూరా, విష్ణుపురి, సిద్ధేశ్వర్ బ్యారేజీ, యెల్దారి ప్రాజెక్టులు నిండటంతో గేట్లు ఎత్తారు. ఈనేపథ్యంలో ఎస్సారెస్పీకి ప్రవాహ ఉద్ధృతి కొనసాగుతోంది. జోరువర్షాలతో మంజీరాలోనూ ప్రవాహం పెరగడంతో కందకుర్తి వద్ద 30అడుగుల మేర నీటి ప్రవాహం ఉంది.