నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్... కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా జరగనుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 824మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీళ్లలో 24మంది కొవిడ్ పాజిటివ్‌గా తేలారు. వీరిలో ఒకరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. మిగతా వాళ్లు పోలింగ్ చివరి గంటలో ఓటు వేయనున్నారు. సొంత వాహనం.. లేదంటే ప్రత్యేకంగా అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తారు. పీపీఈ కిట్ ధరించిన తర్వాతే పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు.
పోలింగ్ ఏర్పాట్లు పూర్తి.. ఓటేయడమే తరువాయి 50 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
మండలానికి ఒకటి చొప్పున మొత్తం 50 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 483, కామారెడ్డి జిల్లాలో 341మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో 67, చందూర్ మండల పరిషత్‌లో నలుగురు ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కోసం 399మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. పోలీసు బందోబస్తు కోసం 963 మందిని కేటాయించారు. ఒక అదనపు డీసీపీ, ఆరుగురు ఏసీపీలు, 22మంది సీఐలు, ముగ్గురు ఏఆర్ ఎస్సైలు, 72 మంది ఎస్సైలు మిగతా సిబ్బంది ఉన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించారు. పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరంలో ఉండే కార్యాలయాలు, సంస్థలకు సెలవు ప్రకటించారు.
కొవిడ్ నిబంధనల నడుమ
బ్యాలెట్ పద్ధతిలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. ప్రాధాన్య అంకె రూపంలో ఓటును నమోదు చేయాల్సి ఉంటుంది. బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థి పేరు, చిత్రం, పార్టీ పేరు ఉంటుంది. పార్టీ గుర్తు బ్యాలెట్‌పై ఉండదు. ఓటరు వేలుకు ఎలాంటి సిరా చుక్క వేయరు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఓటేసేందుకు అవకాశం కల్పించారు. ఓటింగ్ పూర్తయినా.. పోలింగ్ సయమం ముగిసే వరకు పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాల్లోనే ఉంటారు. పోలింగ్ ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసివేస్తారు. కొవిడ్ నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తల నడుమ ఎన్నిక జరగనుంది. సిబ్బందికి పోలింగ్ సామాగ్రితోపాటు కోవిడ్ కిట్లు అందించారు.
ఓటేయనున్న ఎక్స్‌అఫీషియో సభ్యులు
ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, షకీల్, గంప గోవర్ధన్, పోచారం శ్రీనివాసరెడ్డి, సురేందర్ తోపాటు ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, ఆకుల లలిత, రాజేశ్వర్ ఓటు వేయనున్నారు. భాజపా ఎంపీ అర్వింద్ సైతం ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్, సురేశ్‌రెడ్డి, జీహెచ్ఎంసీలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉండటం వల్ల ఇక్కడ ఓటేసే అవకాశం లేదు.
ఇదీ చూడండి:'దుబ్బాకలో గెలుపు కాంగ్రెస్‌దే... రెండో స్థానం కోసమే వారి కొట్లాట'