crop damage in nizamabad: అకాల వర్షం రైతులను ఆగం చేసింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలను వర్షాలు అతలాకుతలం చేశాయి. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి నట్టేట మునిగామంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొంత మంది రైతులు కోతలు కోసి, వడ్ల కుప్పలు పోసి కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయాల కోసం ఎదురు చూస్తున్నారు. మరికొంత మంది కోతకు సిద్ధంగా ఉన్నారు.
కొనుగోలు కేంద్రాల దగ్గర కనీస సౌకర్యాలు లేవు: కొనుగోలు కేంద్రాల్లో విక్రయం కోసం తెచ్చిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దవటంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వర్షం వస్తే వరిధాన్యంపై కప్పేందుకు టార్పాలిన్లు, ప్లాస్టిక్ కవర్లు సైతం లేకపోవడంతో ధాన్యం తడిసి పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యంగా వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినందున ఈ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ మండిపడుతున్నారు.
ఏ ఏ ప్రాంతాల్లో తీవ్రంగా రైతులు నష్టపోయారు: ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లోనూ అకాల వర్షం తీరని ఇబ్బందులను మిగిల్చింది. ఆర్మూర్ నియోజకవర్గంలో మాక్లూర్, నందిపేట్, ఆర్మూర్ మండలాల్లో కురిసిన వర్షానికి కల్లాల్లో ఉన్న ధాన్యం తడిచిపోయింది. బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ మండలంలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి భీంగల్, ముచుకుర్, బడా భీంగల్, బెజ్జోరాతో పాటు పలు గ్రామాల్లో భారీగా వర్షం కురిసింది. దీంతో పూర్తిగా ధాన్యం తడిసిపోయింది. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఒక్కసారిగా పిడిగులాగా పడిన వర్షానికి రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకుంటున్నారు.