తెలంగాణ

telangana

ETV Bharat / state

నాడు ధాన్యం కొనుగోళ్లు.. నేడు చెల్లింపుల కోసం అన్నదాత ఎదురుచూపులు - farmers expect payments for grain purchases

యాసంగి ధాన్యం కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. మొన్నటి దాకా వడ్ల కొనుగోలు విషయంలో ఆగమాగమైన అన్నదాతలు.. ఇప్పుడు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. వానాకాలం ప్రారంభమైన ఓ వైపు వర్షాలు పడుతుండగా.. పెట్టుబడి డబ్బుల కోసం రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అమ్మిన పంటకు డబ్బులు రాక అన్నదాతలు అవస్థలు గురవుతున్నారు.

expect payments for grain purchases
expect payments for grain purchases

By

Published : Jun 16, 2022, 7:18 AM IST

నాడు ధాన్యం కొనుగోళ్లు.. నేడు చెల్లింపుల కోసం అన్నదాత ఎదురుచూపులు

యాసంగి సాగు ఆరంభం నుంచి అడుగడుగునా ఇబ్బందులకు గురవుతున్న రైతులు.. వానాకాలం ప్రారంభమవుతున్నా గత సీజన్‌ కష్టాలు వీడటంలేదు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ధాన్యం కొనుగోలుకు తొలుత శుభముహూర్తం పేరుతో కొన్ని రోజుల పాటు అన్‌లోడింగ్‌ చేపట్టని మిల్లర్లు.. తర్వాత అవుట్ టర్న్ విషయం తేలే దాకా దించుకోమంటూ మొండికేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని మిల్లర్లతో పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న విధానాన్ని జిల్లాలోనూ అమలుచేస్తామన్న హామీతో ధాన్యం సేకరణను ప్రారంభించారు.

ఇంతలో అకాల వర్షాలతో కేంద్రాల్లో ధాన్యం తవడగా అలాంటి ధాన్యాన్ని కొనబోమంటూ మొండికేశారు. తర్వాత అడిగినంత తరుగు ఇచ్చిన వారివే తీసుకున్నారు. కామారెడ్డి జిల్లాలో కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించేందుకు లారీలు రాక 15 రోజుల పాటు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఎల్లారెడ్డి, మాచారెడ్డి, నిజాంసాగర్ తదితర మండలాల్లో అన్నదాతలు రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు సైతం చేపట్టారు. చివరకు అరకొరగా సేకరించినా డబ్బు చెల్లింపులు చెయ్యక రైతులు అవస్థలు పడుతున్నారు.

నిజామాబాద్ జిల్లాలో 6లక్షల 33వేల 247 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా.. 1241.16 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. వీటిలో 840.96 కోట్లు రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 400.20 కోట్లు చెల్లించాల్సి ఉంది. కామారెడ్డి జిల్లాలో 2లక్షల 60 వేల 796.50 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా.. 509.17 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. వీటిలో 315.71 కోట్ల రూపాయలను మాత్రమ జమ చేశారు. మరో 193.46 కోట్లు చెల్లించాల్సి ఉంది. నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేసిన 72 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాల్సి ఉండగా.. ఇందుకు పక్షం రోజులు పైగానే సమయం పడుతోంది. వానాకాలం సీజన్ ప్రారంభమై వర్షాలు పడుతుండగా. పెట్టుబడి డబ్బు చేతిలో లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం మొదట్లో వరి వద్దనడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయగా... మరికొందరు బీడుగా పెట్టారు. ఫలితంగా ప్రస్తుత సీజన్‌లో పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్దేశించుకున్న లక్ష్యంలో సగం ధాన్యం మాత్రమే సేకరించారు. అయినా నిధులు జమ చేయ డంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఓటీపీ నంబరు కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు చెప్పి 20 రోజులు గడుస్తున్నా జమ కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యాసంగి పంట సాగు కోసం అప్పులు చేసిన అన్నదాతలు.. ఈ వానాకాలం పంట వేసేందుకు పెట్టుబడి పెట్టలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. బ్యాంకులో కొత్త అప్పులు ఇవ్వకపోవటంతో వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి డబ్బులు తీసుకుంటున్నట్లు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రక్రియ వేగవంతం చేసి త్వరగా పంట కొనుగోలు చేసిన డబ్బులు ఖాతాల్లో జమ చేయాలని రైతులు కోరుతున్నారు.

ఇదీచదవండి:

ABOUT THE AUTHOR

...view details