వడగళ్ల వానతో అన్నదాతలు బెంబేలు.. రోడ్డెక్కిన నిరసనలు Farmers Protest in Nizamabad: రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు, వడగళ్ల వాన రైతుల్ని కోలుకోలేని దెబ్బతీస్తోంది. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి ప్రాథమిక వ్యవసాయ సంఘ పరిధిలోని ఘన్‌పూర్ కొనుగోలు కేంద్రం వద్ద.. రైతులు ఆందోళనకు దిగారు. పంట కోసి నెల కావస్తున్నా.. కొనుగోలు వేగంగా పూర్తి చేయట్లేదని సొసైటీ ఛైర్మన్‌ని నిలదీశారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని నిరసనకు దిగారు. ఇదే పరిస్థితి కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
Farmers Protested in Nalgonda : మెదక్ జిల్లా శివంపేట, నర్సాపూర్, వెల్దుర్తితో పాటు పలు మండలాల్లో గత కొన్ని రోజులుగా కురిసిన అకాల వర్షం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అన్నదాతలను నిన్న సాయంత్రం కురిసిన గాలితో కూడిన వాన మరోసారి తీవ్రంగా దెబ్బతీసింది. కళ్లముందే ధాన్యం నీటిపాలై పోతుంటే ముద్ద దిగడం లేదని రైతన్న ఆవేదన చెందుతున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురం వ్యవసాయ మార్కెట్లో ఆలగడప ఐకేపీ కేంద్రం, మిర్యాలగూడ పీఏసీఎస్సీ సెంటర్ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోతోంది.
delay in paddy procurement in telangana : 20 రోజుల నుంచి ధాన్యాన్ని తెచ్చి కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నా పట్టించుకున్న నాధుడు లేరని కర్షకులు వాపోతున్నారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయిందని ఆవేదన చెందుతున్నారు తడిసిన ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ అవంతిపురం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలసి తన నిరసన వ్యక్తం చేశారు.
ఈదురుగాలులతో ధ్వంసమైన బొప్పాయి: నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పలు గ్రామాల్లో.. రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి బొప్పాయి పూర్తిగా ధ్వంసమైంది. చిట్యాల మండలం వేంబావిలో రైతు నర్సింహ సాగు చేసిన రెండెకరాల్లోని బొప్పాయి చెట్లు నేలకొరిగాయి. కోతకు వచ్చిన కాయలను మార్కెట్‌కి తరలించేందుకు సిద్ధమవుతున్న తురణంలో ఈదురుగాలులకి నేలరాలడంతో రైతులు దిక్కుతోచని స్థితిలోపడిపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కర్షకులు వేడుకుంటున్నారు.
"మేం ఇక్కడికి వచ్చి 20 రోజులు అవుతోంది. నాలుగు రోజుల క్రితం వర్షం వచ్చింది. ధాన్యం మొత్తం తడిసిపోయింది. తిరగేసి ఎండకి ఆరబోశాం. మళ్లీ వర్షం పడితే.. తిరగేయ్యడానికి కూలీలను పెట్టాల్సి వచ్చింది. అమ్మడానికి తెచ్చాక కూడా వడ్లు తడిసిపోతున్నాయి. నాలుగైదు రోజుల నుంచి నీళ్లల్లోనే ఉంటన్నాయి. మొలకలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వం కొంచెం మమ్మల్ని ఆదుకోవాలి." -రైతు