తెలంగాణ

telangana

ETV Bharat / state

Rains in Nizamabad: అన్నదాతల 'వరి'గోస... నట్టేట ముంచేసిన అకాల వర్షం

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో అకాల వర్షాలు(Rains in Nizamabad) రైతుల(farmers problems)ను నట్టేట ముంచుతున్నాయి. చేతికొచ్చిన ధాన్యం కళ్ల ముందే.... వరదలో కొట్టుకుపోతుంటే.... అన్నదాతల ఆవేదన అరణ్యరోదనగా మారింది. కొనుగోళ్ల(paddy procurement telangana)లో జాప్యం కూడా తమ పాలిటశాపంగా మారిందని కర్షకులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

farmers-problems-in-nizamabad-due-to-rains
farmers-problems-in-nizamabad-due-to-rains

By

Published : Nov 17, 2021, 4:36 AM IST

కాలం సహకరించడంతో అప్పొసప్పో చేసి రైతులు పంట పండించారు. పుష్కలమైన సాగునీరు ఉండటంతో మంచి దిగుబడులు వచ్చాయి. కానీ అంతా బాగుంటే రైతు బతుకెందుకు అవుతుందని అన్నట్లు... వరుణుడి ఆగ్రహానికి అన్నదాత ఆశలు అడియాసలయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం పూర్తిగా తడిసిముద్దయింది. నోటికాడి బుక్కను ఎత్తగొట్టినట్లు.... నాలుగు రోజులైతే తరలివెళ్లాల్సిన ధాన్యం.... కళ్లముందే వరదలో కొట్టుకుపోయింది. బస్తాల్లో నింపిన ధాన్యం నుంచి నీళ్లు కారుతుండటం కలిచి వేసింది. ఇక ఆరబోసిన ధాన్యమైతే నీళ్లతో నిండిపోయి రైతులకు ఏడుపు తెప్పించింది. తడిసిన ధాన్యం ఎలా ఆరబెట్టాలో, ఇప్పటికే కాంటా పూర్తయి తడిసిపోయిన ధాన్యం బస్తాలను ఏం చేయాలో పాలుపోని దిక్కుతోచని స్థితిలో అన్నదాత కుమిలిపోతున్నాడు.

కామారెడ్డి జిల్లాలో అకాల వర్షానికి అన్నదాతలు అల్లకల్లోలమయ్యారు. మాచారెడ్డి మండలం పాల్వంచ వాగు వద్ద రోడ్డుపై ఆరబోసిన వడ్లు వరదలో కొట్టుకుపోయాయి. కామారెడ్డి మండలం సరంపల్లి కొనుగోలు కేంద్రం చెరువులా మారింది. భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో రోడ్డుపై ఆరబోసిన ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. కామారెడ్డి శివారులో ఆరబోసిన ధాన్యం..వరదలో కొట్టుకుపోయి డ్రైనేజీల్లో తేలింది. బీబీపేట, బీర్కూర్‌, తాడ్వాయి, సదాశివనగర్, రాజంపేట్, మాచారెడ్డి, గాంధారి మండలాల్లోనూ ఇవే దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. తేమ పేరిట వేధించకుండా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అన్నదాతలు వేడుకున్నారు.

అకాల వర్షానికి ధాన్యం తడిసి పోవడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. కొనుగోళ్లలో జాప్యమే నష్టానికి కారణమంటూ పలు చోట్ల రైతులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా పరిధిలోని అడ్లూరు గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో గంటన్నర పాటు రవాణాకు అంతరాయం ఏర్పడింది. అనంతరం కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రైతులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంట దిగుబడి పెరిగిందని సంతోషపడేలోపే తమ ఆశలపై వరుణదేవుడు నీళ్లు చల్లాడని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులు త్వరగా స్పందించి కొనుగోలు త్వరితగతిన చేసి వుంటే నష్టం ఇంతా తీవ్రంగా ఉండేది కాదని వాపోయారు.

మొగులు చూస్తే బుగులుతో వణుకుతున్న రైతులు...కొనుగోళ్లలో జాప్యమూ తమ పాలిట శాపంగా మారుతోందని ఆవేదన చెందుతున్నారు. కొనుగోళ్లు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా... ఇంకా ఊపందుకోలేదు. నిజామాబాద్ జిల్లాలో 426 కేంద్రాల్లో... ఇప్పటి వరకు 685కోట్ల విలువైన ధాన్యం సేకరించారు. రైతుల ఖాతాల్లో 8.5కోట్లు జమ చేశారు. తమ వంతు రాక కోసం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాస్తున్నారు. కాంటా వేసినా లారీలు లేక.. నిరీక్షణ తప్పడం లేదు. నగదు జమలోనూ ఆలస్యం జరుగుతోంది.

ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కొనుగోళ్లు వేగంగా జరిగేలా చూడాలని రైతులు వేడుకుంటున్నారు. వర్షసూచనతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఆపసోపాలు పడుతున్న రైతులు.... ధాన్యం త్వరగా మిల్లులకు తరలేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.


ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details