Paddy procurement in Telangana : నిజామాబాద్ జిల్లాలో ధాన్యం రైతులకు అవస్థలు ఎదురవుతూనే ఉన్నాయి. మందకొడిగా సాగుతున్న కొనుగోళ్లతో పాటు ఐకేపీ సెంటర్లలోని సమస్యలు మరింత ఇబ్బందికి గురి చేస్తున్నాయి. తూకం వేసిన ధాన్యం తరలింపులోనూ ఆలస్యంతో అవస్థలు తప్పట్లేదు. వర్షం వస్తే బస్తాల్లో ధాన్యం మొలకెత్తుతుందనే భయం ఓ వైపు, ఆలస్యం అయ్యే కొద్దీ బస్తాల్లోని ధాన్యం బరువు తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు.
Paddy procurement problems in Telangana : నిజామాబాద్ జిల్లాకు దాదాపు 850 వరకు లారీలు సమకూర్చినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే మాక్లూర్ మండలం అమ్రాద్ రైతులు రోడ్డుపై వెళ్తున్న లారీలను అడ్డగించి వాటి కింద పడుకొని నిరసన తెలిపటం లారీల కొరత తీవ్రతను తెలుపుతోంది. మిల్లులకు చేరిన వడ్లు ఎప్పటికప్పుడు దించుకుంటే సమస్య పెద్దగా ఉండదు. అయితే తడిసి ఆరిన వడ్లు కావటంతో మిల్లర్లు తరుగు అడుగుతున్నారు. సాధారణంగా కొనుగోలు కేంద్రంలో కాంటా వేసేటప్పుడే ఒకటి నుంచి రెండు కిలోలు తరుగు తీస్తున్నారు. బస్తాల్లో నింపి మిల్లుకు పంపిన తర్వాత సైతం మళ్లీ తరుగు తీస్తున్నారు. ఒప్పకోకపోతే ధాన్యం దించుకోకుండా రోజుల కొద్ది అలాగే ఉంచుతున్నారు. సొసైటీ సిబ్బంది మధ్యవర్తిత్వంతో కొంత తరుగు తీసుకుంటున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.