తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశమంతా ఓ ఎత్తు... నిజామాబాద్​ మరోఎత్తు...! - COMMISSION

12 వేల బ్యాలెట్​ యూనిట్లు... 600 మంది ఇంజినీర్లు... జాతీయ నిపుణుల శిక్షణలో... వేల సిబ్బంది... ఒకే పార్లమెంట్​ నియోజకవర్గం. నిజామాబాద్​ పార్లమెంటు ఎన్నికల అంశం రసవత్తరంగా మారింది. దేశంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో అభ్యర్థులకు ఈవీఎంల ద్వారా... ఎన్నికలు నిర్వహించటాన్ని సీఈసీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

12 వేల బ్యాలెట్​ యూనిట్లు... 600 మంది ఇంజినీర్లు...

By

Published : Apr 2, 2019, 6:50 PM IST

12 వేల బ్యాలెట్​ యూనిట్లు... 600 మంది ఇంజినీర్లు...
దేశంలోనే తొలిసారిగా ఎక్కువ మంది అభ్యర్థులకు ఈవీఎంల ద్వారా నిజామాబాద్​లో పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. హైదరాబాద్​లో పర్యటిస్తున్న సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేష్​ సిన్హా నేతృత్వంలోని ఈసీ బృందం... నిజమాబాద్ పోలింగ్​పై విస్తృతంగా చర్చించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్, నిజమాబాద్, జగిత్యాల కలెక్టర్లు, ఇతర అధికారులు, బెల్, ఈసీఐఎల్ ఇంజినీర్లతో సమీక్షించారు.

మరో మైలురాయి...

ఈవీఎంలనుతొలిసారి తయారు చేసింది హైదరాబాద్​లోనేనని డిప్యూటీ ఎన్నికల కమిషనర్​ ఉమేష్​ సిన్హా గుర్తుచేశారు. భారీ సంఖ్యలో అభ్యర్థులు ఉన్నప్పటికీ ఈవీఎం, వీవీప్యాట్​ల ద్వారా పోలింగ్ నిర్వహించడం కూడా ఎన్నికల చరిత్రలో నిలిచిపోయే మరో మైలురాయిగా ఉమేష్ సిన్హా ఉద్ఘాటించారు.

25వేల బ్యాలెట్​ యూనిట్లతో...

రాష్ట్రంలో ఒక్కో పోలింగ్​స్టేషన్లో 12 బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నట్లు సిన్హా తెలిపారు.​ ఈ చొప్పున నిజామాబాద్​లో మొత్తం 25వేల బ్యాలెట్​ యూనిట్లు, 2 వేల కంట్రోల్​ యూనిట్లు, 2వేల వీవీప్యాట్లు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. నిజామాబాద్​, జగిత్యాల జిల్లాల్లో కలిపి 1788 పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈవీఎంల మొదటి దశ తనిఖీ రేపు ఉదయం నుంచి ప్రారంభం అవుతుందన్న ఉమేష్ సిన్హా... రేపట్నుంచి ఈనెల 11 వరకు నిజామాబాద్​లో 600 మంది ఇంజినీర్లు అందుబాటులో ఉంటారని వెల్లడించారు.

ప్రత్యేక పరిశీలకులతో పర్యవేక్షణ...

పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు జాతీయ స్థాయి శిక్షకులు వస్తారని తెలిపారు. సెక్టోరల్ అధికారులు, సిబ్బంది సంఖ్యను పెంచుతామన్న ఉమేష్​... 5 పోలింగ్ కేంద్రాలకు ఒక సెక్టోరల్ అధికారి ఉంటారని చెప్పారు. నిజామాబాద్ పోలింగ్ కోసం ప్రత్యేక పరిశీలకులను నియమిస్తామని... ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు ఉన్నందున పోలింగ్ విధానంపై ఓటర్లకు విస్తృతంగా అవగాహన కల్పిస్తామని తెలిపారు.

తొలిసారిగా 12 యూనిట్లతో పోలింగ్​...

ఇప్పటి వరకు గరిష్ఠంగా 4 బ్యాలెట్ యూనిట్లతో పోలింగ్ నిర్వహించామని... తొలిసారిగా 12 యూనిట్లతో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు మరో డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సుదీప్ జైన్ అన్నారు. రేపు ఉదయానికల్లా యంత్రాలన్నీ నిజామాబాద్ చేరుకుంటాయని రజత్ కుమార్ తెలిపారు. పోలింగ్ తేదీలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.

పటిష్ఠ బందోబస్తు నడుమ...

రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్​కే జోషి తెలిపారు. డీజీపీ మహేందర్​రెడ్డి, సీఈఓ రావత్​, సీఎస్​తో కేంద్ర ఎన్నికల సంఘ బృందం సమావేశం నిర్వహించింది. 145 కంపెనీల కేంద్ర బలగాలను రాష్ట్రానికి కేటాయించగా... నిజామాబాద్​కు అదనపు బలగాలను పంపనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి:దేశ చరిత్రలో నిజామాబాద్​ ఎన్నికలు ఓ మైలురాయి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details