తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇందూరులో ప్రయోగాత్మకంగా డ్రాగన్​ ఫ్రూట్​ సాగు - dragon crop cultivation in induru

ఉద్యాన పంట సాగులోనే వైవిధ్యమైంది డ్రాగన్‌ఫ్రూట్‌. మన రాష్ట్రంలోనూ వీటి సాగుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని తేలడంతో జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టారు. ప్రభుత్వం సైతం ప్రోత్సాహం కల్పిస్తుండటంతో కోటగిరి మండలం ఎత్తోండ క్యాంపునకు చెందిన రైతు సుబ్బారావు వీటి సాగుకు ముందుకొచ్చారు.

dragon fruit crop cultivation in nizamabad
ఇందూరులో ప్రయోగాత్మకంగా డ్రాగన్​ ఫ్రూట్​ సాగు

By

Published : Sep 19, 2020, 3:58 PM IST

డ్రాగన్ పంట సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలం. సేంద్రియ కర్బనంతో కూడిన ఎర్రని ఇసుక నేలలైతే మరింత శ్రేష్ఠం. ఎకరాకు 2 వేల మొక్కలు, 500 సిమెంటు స్తంభాలు అవసరమవుతాయి. స్తంభానికి నలుదిక్కులా రెండు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పుతో గుంతలు తవ్వాలి. నేలను బట్టి సాగుచేసిన రకం ఆధారంగా నీటి తడులు అందివ్వాలి. సంవత్సరానికి రెండుసార్లు పశువుల ఎరువు వేసి సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. అనంతరం 18 నెలల్లో కాపు వస్తోంది. రాత్రి సమయంలో పూలు వికసిస్తుండటంతో ‘క్వీన్‌ ఆఫ్‌ నైట్‌’ అని కూడా పిలుస్తారు. ఒక్కసారి నాటితే 20 ఏళ్ల వరకు దిగుబడులు వస్తాయి.

ఇందూరులో.. డ్రాగన్‌

పండ్లు చూడటానికి ఎరుపు, గులాబీ రంగులు కలిసినట్టుగా ఉంటుంది. నల్లని గింజలను ఆయుర్వేదంలో కూడా వాడతారు. కిలో రూ.200 నుంచి రూ. 250 పలుకుతుంది. విలువైన పోషకాలు ఉన్న ఈ పంట ఇటీవల వాణిజ్య పంటగా అవతరించడంతో పలు రాష్ట్రాల్లో ఔత్సాహిక రైతులు సాగుచేస్తున్నారు.

సుబ్బారావు తన ఇంటి ఆవరణలో 10 గుంటల విస్తీర్ణంలో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేపట్టారు. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌ నుంచి రూ.70కి ఒక మొక్క చొప్పున 500 కొనుగోలు చేసి నాటారు. మొక్క ఎదుగుదలకు అవసరమయ్యే సిమెంటు స్తంభాలను ఇంటి వద్దే తయారు చేయించుకున్నారు. ప్రస్తుతం మొదటికాపు చేతికొచ్చింది. ఎరుపు రంగు కండ గల పండ్లను కిలో రూ.220కి ఇంటి వద్దే విక్రయిస్తున్నారు. ఈ ఏడాది మరో ఎకరం విస్తీర్ణంలో మొక్కలు నాటడానికి సన్నద్ధమవుతున్నారు.

లాభదాయకం:

డ్రాగన్‌ పంట రైతులకు ఎంతో లాభదాయకం. మొక్కలకు స్తంభాలకు మాత్రమే పెట్టుబడి అవసరమవుతోంది. పంటలో గులాబీ, తెలుపు, పసుపుపచ్చ రకాలు ఉంటాయి. వీటిలో గులాబీ రంగు కండ ఉన్న వాటికి డిమాండు ఉంది. నాటిన తర్వాత 18 నెలల్లో కాపు వస్తుంది. మరి కొంత మంది రైతులు వీటి సాగుకు ముందుకు రావాలి.

పండరి, ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి, బోధన్‌

రాయితీలు కల్పించాలి:

ఇది ఖర్చుతో కూడుకున్నది. ఎకరాకు రూ.6 లక్షల వరకు పెట్టుబడి పెట్టాలి. ఒక్కసారి నాటితే 20 ఏళ్ల వరకు దిగుబడి ఉంటుంది. సాగు వ్యయం ఎక్కువ కాబట్టి ప్రభుత్వం రాయితీలు కల్పించాలి.

సుబ్బారావు, ఎత్తొండ క్యాంపు

ABOUT THE AUTHOR

...view details