Farmers Dharna At Grain Buying Centres : ఆరుగాలం కష్టించి పండించిన పంటను.. అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువెళ్లి రోజులు గడుస్తున్నా.. కొనుగోలు చేయడం లేదంటూ.. మెదక్ జిల్లా సోంపేట మండలం గంగాయపల్లి రైతులు నిరసనబాట పట్టారు. నరసాపూర్ తూప్రాన్ రహదారిపై ధాన్యం బస్తాలతో ధర్నా చేపట్టారు. వారికి బీజేపీ నాయకులు మద్దతు పలికారు. హత్నూరు మండలం చింతలచెరువు అన్నదాతాలు.. ధాన్యం కొనుగోలు చేయాలంటూ.. రాస్తారోకో చేపట్టారు. పోలీసులు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో.. రైతులు ఆందోళనను విరమించారు.
జాతీయ రహదారులపై ధర్నాలు : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారుల తీరును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా జుక్కల్ లో రైతులు ఆందోళనకు దిగారు. జుక్కల్ చౌరస్తాలో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించిన రైతన్నలు.. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి ఆవేదన చెందారు. దాదాపు ఏడు రోజుల నుంచి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు జరగడం లేదని.. బస్తాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. అన్నదాతల ధర్నాతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సముదాయించటంతో ఎట్టకేలకు ఆందోళన విరమించారు.
క్వింటాల్ వరి ధాన్యానికి.. ఐదు కిలోల కోత : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో బూరుగుపల్లి గ్రామ రైతులు ధాన్యం కొనుగోలు చేయాలంటూ నిరసన చేపట్టారు. తేమ పేరుతో క్వింటాల్ వరి ధాన్యానికి.. ఐదు కిలోలు కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోహిణి కార్తె వేళవుతున్నా ఇంకా ధాన్యం పూర్తి కాలేదని.. రైతుల ఆవేదనను కేసీఆర్ గుర్తించాలని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాలోని తిప్పన్నపేట ఐకేపీ సెంటర్ వద్ద.. ధాన్యం కొనుగోలు తీరును నిరసిస్తూ రైతులు ఆందోళన చేశారు. జీవన్‌రెడ్డి అన్నదాతలకు మద్దతుగా ధాన్యం కేంద్రం వద్ద గంటకు పైగా నిరసన తెలిపారు.