మూడేళ్లకే విశాల్‌కు కంటి చూపు సమస్య ఎదురైంది. దూరంలోని వస్తువులు మసకగా కనిపించేవి. వైద్యుల రెటీనా సమస్య ఉందని... వయసు పెరిగే కొద్దీ చూపు తగ్గుతుందని.. 40 ఏళ్లు వచ్చే సరికి పూర్తిగా అంధత్వం రావొచ్చన్నారు. కంటి సమస్య తలెత్తడంతో విశాల్‌ను స్థానికంగా ఉన్న స్నేహ సొసైటీ అంధుల పాఠశాలలో చేర్పించారు. హైదరాబాద్ ఉప్పల్‌లోని జీఎల్ఆర్ న్యూ మోడల్ కళాశాల నుంచి ఇంటర్, దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేశాడు.
తెలియని పరిస్థితి
చదువుకునే రోజుల్లో విశాల్‌ను లూయీ బ్రెయిలీ చరిత్ర ఆకర్షించింది. ఆయన జీవిత చరిత్ర అందరికీ చేరువ చేసేందుకు లఘుచిత్రం తీయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే సంగీతం, సినిమాపై అభిరుచి పెరిగింది. ఎలాగైనా ప్రతిభ నిరూపించుకోవాలని భావించాడు. కానీ చిత్ర నిర్మాణం గురించి ఎవరిని అడగాలో, ఏం చేయాలో తెలియని పరిస్థితి. తన ఆలోచన ఎవరికి చెప్పినా అవమానాలు, అవహేళనలు తప్ప సహకారం మాత్రం లభించలేదు. అయినా పట్టు వదలకుండా లఘుచిత్రాలపై దృష్టి సారించాడు.
ప్రశంసలు
అనేక ఇబ్బందులు ఎదురైనా లఘు చిత్రాలను వదిలి పెట్టలేదు విశాల్. తనకొచ్చే దివ్యాంగ పింఛను డబ్బులు పోగు చేసి.. తొలి ప్రయత్నంగా ఆదర్శ దివ్యాంగులు అనే చిత్రం తీశాడు. విశాల్‌తోపాటు అతడి ఇద్దరు స్నేహితులకు ఎదురైనా ఇబ్బందులు, మానసిక స్థితిగతులకు రూపం ఇస్తూ నిర్మించిన ఈ చిత్రం.. అందరి ప్రశంసలు పొందడంతో పాటు విశాల్‌లోని ప్రతిభను చాటి చెప్పింది.
ఆలోచింపజేసేలా
విశాల్ చదువుకున్న స్నేహ సొసైటీ నిర్వాహకులు సిద్ధయ్య సహకారంతో రెండవ లఘు చిత్రం మరువలేని ప్రేమ నిర్మించాడు. సంపన్న కుటుంబంలో పుట్టిన అమ్మాయిని ప్రేమించిన పేదింటి యువకుడి పరిస్థితి ఏంటని ఆలోచింపజేసేలా చూపించాడు. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా నుంచి గల్ఫ్ వెళ్లిన వారు పడే బాధల గురించి గల్ఫ్ గోసను తీశాడు.