నిజామాబాద్ జిల్లా రెంజల్ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 16 మంది ఉపాధ్యాయులకు డీఈవో దుర్గాప్రసాద్ గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తగిన చర్యలు ఎందుకు తీసుకోకూడదో సంజాయిషీ ఇవ్వాలని పేర్కొన్నారు. 'సార్ ఈ అన్నం తినలేకపోతున్నాం... విద్యార్థులు వినూత్న నిరసన' శీర్షికన ఈటీవీ భారత్లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయ ఏడీ నాగజ్యోతి, సర్వశిక్షా అభియాన్ అధికారి రామ్మోహన్‌రావుతో విచారణ చేయించారు. పాఠశాలకు చేరుకున్న వారు ఇన్‌ఛార్జి ఎంఈవో గణేశ్‌రావుతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులతో వేర్వేరుగా మాట్లాడారు.
అసలేెం జరిగిదంటే: మధ్యాహ్న భోజనంలో రాళ్లు, పురుగులు వస్తున్నాయని అన్నం తినలేకపోతున్నామని విద్యార్థులు నిరసన బాట పట్టారు. భోజనం సరిగ్గా పెట్టడం లేదని, నీళ్లు చారు పోస్తున్నారని విద్యార్థులు వాపోయారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పాఠశాల ముందు బైఠాయించి వారు నిరసన వ్యక్తం చేశారు. ఏజెన్సీ నిర్వాహకులను మార్చాలని వారు డిమాండ్ చేశారు.