తెలంగాణ

telangana

ETV Bharat / state

మృతదేహం తారుమారు.. గుర్తించేలోపే అంత్యక్రియలు!

నిజామాబాద్ జిల్లా​లో కొవిడ్​తో చనిపోయిన మహిళల మృతదేహాలు తారుమారు కావడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఇది గుర్తించేలోపే ఏమాత్రం సంబంధంలేని వారు ఓ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం తమ సంబంధీకురాలి మృతదేహాన్ని అలాగే వదిలేసి వెళ్లిపోయారు. ఈ అమానవీయ ఘటన జిల్లా ప్రభుత్వాసుపత్రిలో జరిగింది.

corona dead body change, covid dead body change in hospital
కరోనా మృతదేహాలు తారుమారు, కొవిడ్ మృతదేహాలు తారుమారు

By

Published : Apr 17, 2021, 6:48 AM IST

కరోనాతో చనిపోయిన మృతదేహాలు మారిపోయాయి. పొరపాటును గుర్తించేలోపే సంబంధంలేని వారు ఓ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. జరిగిన పొరపాటును గుర్తించిన తర్వాత తమ సంబంధీకురాలి భౌతిక దేహాన్ని మాత్రం అనాథలా ఆసుపత్రిలో వదిలేసి వెళ్లారు. ఈ అమానవీయ ఘటనకు నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం వేదికైంది. కొద్ది రోజుల క్రితం జిల్లా కేంద్రం నిజామాబాద్‌కు చెందిన మహిళ, పక్క జిల్లాకు చెందిన మరో ముస్లిం మహిళ కరోనాతో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో చేరారు.

ఇరువురు గురువారం రాత్రి చనిపోయారు. కొవిడ్‌ నిబంధన ప్రకారం మృతదేహాలను కవర్లతో చుట్టేసిన సిబ్బంది మార్చురీలో భద్రపరిచారు. సాధారణంగా ముఖ భాగంలో కవర్‌ తొలగించి చూపించాకే సంబంధీకులకు మృతదేహాలను అప్పగిస్తారు. ఎలా జరిగిందో ఏమో! నిజామాబాద్‌ వాసులు పక్క జిల్లాకు చెందిన ముస్లిం మహిళ మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు.

అసలు వాళ్లు రావడంతో వెలుగులోకి..

ముస్లిం మహిళ తరఫు బంధువులు శుక్రవారం మధ్యాహ్నం ఆసుపత్రికి చేరుకున్నారు. సిబ్బంది చూపిన మృతదేహాన్ని చూసి అవాక్కయ్యారు. అది తమ సంబంధీకురాలిది కాదంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. విషయం అధికారుల వద్దకు వెళ్లింది. తర్జనభర్జనల అనంతరం మార్చురీలో ఉన్నది నిజామాబాద్‌ నగరానికి చెందిన మహిళదని నిర్ధారించుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులను హుటాహుటిన పిలిపించి విచారించారు. ‘బాధలో ఉన్న తాము అయోమయంలో ముఖాన్ని గుర్తించలేకపోయామని’ ఆ మహిళ సంబంధీకులు లేఖ రాసిచ్చినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ చెప్పారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఈ పరిణామాల అనంతరం చేసేదేమీ లేక ముస్లిం మహిళ తాలూకూ వాళ్లు ఇళ్లకు వెళ్లిపోయారు. మరో మహిళ తరఫువారు మృతదేహాన్ని అక్కడే వదిలేసి ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయారని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.

ఇదీ చదవండి:యువకుడిపై బీరు సీసాతో దాడి.. ఒకరి పరిస్థితి విషమం

ABOUT THE AUTHOR

...view details