Crop Damage in Nizamabad : అకాల వర్షాలతో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అప్పు చేసి పెట్టుబడి పెట్టిన అన్నదాతలు.. పంటచేతికందే సమయంలో కురిసిన వడగండ్ల వానలతో తీవ్రంగా నష్టపోయారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో భూమిలేని కర్షకులు చాలామంది కౌలుకు తీసుకొని పంటలు సాగు చేస్తున్నారు. ఎకరాకు ఆరు నుంచి ఏడు క్వింటాళ్ల ధాన్యం లేదా.. ఎకరాకు రూ.20,000 వరకు కౌలు చెల్లిస్తున్నారు.
Nizamabad Tenant Farmers Problems :ఈ సీజన్‌లో కామారెడ్డి జిల్లాలో 3,500 మంది కౌలు రైతులు.. దాదాపు 40,000 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 4,500 మంది కౌలు రైతులు లక్ష ఎకరాల్లో పంటలు సాగు చేశారు. రెక్కల కష్టంతో సాగుచేసి చివరకు.. వరి కోసి ధాన్యాన్ని కేంద్రాలకు తరలించే వరకు ఎకరాకు రూ.25,000 నుంచి రూ.30,000 వరకు ఖర్చు చేశారు. కొన్నిచోట్ల కోతకు వచ్చిన వరి వర్షాలకు దెబ్బతినడంతో.. వారు తీవ్రంగా నష్టపోయారు.
కౌలు రైతులను.. రైతులుగా గుర్తించకపోవడంతో: వరి కోసిన పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించారు. అయితే వర్షాలకి ధాన్యం తడిసిపోయి.. మొలకలు వస్తుండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు తిరిగివచ్చే పరిస్థితులు లేవని దిగాలు చెందుతున్నారు. రాష్ట్రంలో కౌలు రైతులను.. రైతులుగా గుర్తించకపోవడంతో పంటలు దెబ్బతిన్న సమయంలో వారిని పట్టించుకునే వారు కరవయ్యారు. పంటల సాగుకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు భూయజమాని ఖాతాలోకి వెలుతోంది.