నిజామాబాద్ జిల్లాలో మూతపడ్డ సారంగాపూర్ సహకార, బోధన్ షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించాలని.. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని సీపీఎం నగర కార్యదర్శి మల్యాల గోవర్ధన్ డిమాండ్ చేశారు. జిల్లాలో పరిశ్రమలు తెరిపించకుండా.. పసుపు బోర్డుకు కృషి చేయని ఎంపీ అరవింద్, తెరాస ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని సష్టం చేశారు. కలెక్టరేట్ ఎదుట నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. తెరాస అధికారంలోకిస్తే బోధన్ షుగర్ ఫ్యాక్టరీ స్వాధీనం చేసుకొని కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని కేసీఆర్ ప్రగల్బాలు పలికారని విమర్శించారు. మూతపడ్డ పరిశ్రమలను తెరిపించకపోగా.. అందులో పనిచేస్తున్నవారు అకలితో అలమటించేలా చేశారని మండిపడ్డారు.
'షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలి.. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి' - Nizamabad District Latest News
నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సీపీఎం నేతలు నిరసన వ్యక్తం చేశారు. సారంగాపూర్, బోధన్ షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించాలని, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. కలెక్టరేట్ ఎదుట నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
తమ గోడు వినాలని బోధన్ నుంచి హైదరాబాద్కు పాదయాత్ర చేపట్టి సీఎంను కలవడానికి వెళ్లినప్పడు అడ్డుకుని నిర్బంధించడం సిగ్గుచేటని విమర్శించారు. నిజామాబాద్ సహకార చక్కెర కర్మాగారం, సారంగాపూర్లోని భూములు అన్యక్రాంతమవుతున్నా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయకుంటే రాజీనామా చేస్తానన్న హామీని 'బాండ్ పేపర్ బాయ్' ఎంపీ అరవింద్ మర్చిపోయి కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు నూర్జహాన్, సబ్బని లత పాల్గొన్నారు.
ఇదీ చూడండి:భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాంచందర్రావు నామినేషన్