నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్‌లోని లాలన వృద్ధాశ్రమంలో 11 మంది కొవిడ్ బారిన పడ్డారు. ముగ్గురు అక్కడే హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. మిగిలిన ఎనిమిది మందిలో నలుగురిని కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. మరో నలుగురు ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రిలో ఉన్నారు. మరొకరికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నిజామాబాద్ నగర శివారులోని ముబారక్‌నగర్ ఆలంబన వృద్ధాశ్రమంలో 26 మందికి కొవిడ్ నిర్ధారణ కాగా 11 మందిని ప్రైవేటు ఆసుపత్రుల్లో, 10 మందిని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేర్పించారు. నలుగురిని కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. లక్షణాలు లేని వారిని కుటుంబ సభ్యులు తీసుకెళ్తున్నారు.
పాలనాధికారి ఆదేశాలతో...
వృద్ధాశ్రమాల్లోని వృద్ధులకు కొవిడ్ సోకిందని తెలియగానే కలెక్టర్ నారాయణరెడ్డి స్పందించారు. ఆలంబన వృద్ధాశ్రమాన్ని సందర్శించి, సౌకర్యం ఉన్నవారిని ఇళ్లకు, లేనివారిని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. లక్షణాలు లేనివారిని మాక్లూర్ ఐసోలేషన్ కేంద్రానికి పంపాలని సూచించారు. మూడు అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ఆర్డీవో శ్రీనివాసులు, అధికారులు లాలన వృద్ధాశ్రమాన్ని సందర్శించి, ఆశ్రమ వ్యవస్థాపకుడు రాజారెడ్డితో మాట్లాడి జాగ్రత్తలు వివరించారు.