తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రాల నుంచి ప్రజల రాకపోకలు... జిల్లాల్లో పెరుగుతున్న కేసులు

మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో కరోనా విజృంభిస్తోంది. ఆ రాష్ట్రాల నుంచి ప్రజల రాకపోకల నేపథ్యంలో ఆయా జిల్లాల్లో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. గత ఏడు రోజుల్లో (6-12 వరకు) రాష్ట్రవ్యాప్తంగా 17,846 కొవిడ్‌ కేసులు నిర్ధారణ కాగా.. అందులో 6,713 కేసులు ఆ రెండు రాష్ట్రాలకు సమీపంలో ఉండే 11 సరిహద్దు జిల్లాల్లో నమోదయ్యాయి. ముఖ్యంగా నిజామాబాద్‌ జిల్లాలో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.

corona-cases-increased-in-border-districts-in-telangana
రాష్ట్రాల నుంచి ప్రజల రాకపోకలు... జిల్లాల్లో పెరుగుతున్న కేసులు

By

Published : Apr 14, 2021, 7:21 AM IST

తొలినుంచి హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలు కొవిడ్‌ కేసుల్లో తొలి మూడు స్థానాల్లో ఉంటుండగా.. గత 7 రోజుల్లో 1,500 కేసులతో నిజామాబాద్‌ జిల్లా రంగారెడ్డిని వెనక్కి నెట్టేసి మూడో స్థానానికి చేరింది. సరిహద్దు జిల్లాల్లో నిజామాబాద్‌ తర్వాత గత వారంలో నిర్మల్‌లో 797, జగిత్యాల 779, సంగారెడ్డి 696, కామారెడ్డి 616, కరీంనగర్‌ 605, ఆదిలాబాద్‌ 462, మంచిర్యాల 434, రాజన్నసిరిసిల్ల 345, కుమురంభీం ఆసిఫాబాద్‌ 257, పెద్దపల్లిలో 222 కేసులు నమోదయ్యాయి.

నాలుగు జిల్లాల్లో వెయ్యిపైనే

రాష్ట్రంలో గత వారం రోజుల్లో నమోదైన 17,846 కేసుల్లో 7,749 కేసులు నాలుగు జిల్లాల్లోనే నిర్ధారణ కావడం గమనార్హం. అత్యధికంగా హైదరాబాద్‌లో 2,992, మేడ్చల్‌-మల్కాజిగిరిలో 1,808, నిజామాబాద్‌లో 1,500, రంగారెడ్డిలో 1,449 కేసులు నమోదయ్యాయి.

1,13,007 నమూనాల సేకరణ

రాష్ట్రంలో కొత్తగా 3,052 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32,581కి, మృతుల సంఖ్య 1,772కి చేరింది. 778 మంది కోలుకోగా ఇప్పటివరకు ఆరోగ్యవంతులైన వారి సంఖ్య 3,06,678కి పెరిగింది. ఇంకా 24,131 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కొవిడ్‌ పరీక్షల సంఖ్యను పెంచారు. సోమవారం 1,13,007 నమూనాలను పరీక్షించారు. ఇందులో 4,135 నమూనాల ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. ఇప్పటివరకు జరిపిన కొవిడ్‌ పరీక్షల సంఖ్య 1,11,81,010కి చేరింది. ఏప్రిల్‌ 12వ తేదీ రాత్రి 8 గంటల వరకు నమోదైన సమాచారాన్ని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకుల మంగళవారం వెల్లడించారు. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 406 నమోదయ్యాయి. మేడ్చల్‌-మల్కాజిగిరిలో 301, నిజామాబాద్‌లో 279, రంగారెడ్డిలో 248, జగిత్యాలలో 135, సంగారెడ్డిలో 123, నిర్మల్‌లో 113, కామారెడ్డిలో 111, నల్గొండలో 109 కేసులు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో వంద కంటే తక్కువ ఉన్నాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 1,30,531 మందికి టీకాలు వేశారు. రాష్ట్రంలో టీకా తీసుకున్నవారి మొత్తం సంఖ్య 22,89,368కి చేరింది.

7.38 లక్షల డోసుల నిల్వలు

కేంద్రం నుంచి రాష్ట్రానికి సోమవారం రాత్రి 4,67,470 కరోనా వ్యాక్సిన్‌ డోసులు వచ్చాయని వైద్యఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. ఇప్పటికే వివిధ జిల్లాల్లో ఉన్న 2,70,910 డోసులతో కలిపి మొత్తం 7,38,380 డోసుల నిల్వలు ఉన్నట్లు తెలిపింది. రోజుకు సగటున లక్షన్నర మందికి టీకాలు వేస్తే నాలుగు రోజులకు ఈ నిల్వలు సరిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రోజుకు రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు టీకాలు వేయాలన్న ఆలోచనను విరమించుకున్నారు.

ఇదీ చూడండి:'ఆస్పత్రిలో చేరినవారికే రెమ్​డెసివిర్ డ్రగ్'

ABOUT THE AUTHOR

...view details