తెలంగాణ

telangana

By

Published : Apr 7, 2021, 5:27 PM IST

ETV Bharat / state

నిబంధనలు గాలికొదిలేశారు... వైరస్​ను ఆపలేకపోతున్నారు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రతి రోజూ పాజిటివ్​ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అధికారులు నిర్ధరణ పరీక్షల సంఖ్య సైతం పెంచారు. మాస్కులు ధరించాలని అధికారులు చెబుతున్నా.. ప్రజలు వాటిని పెడచెవిన పెడుతున్నారు. రద్దీ ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనలు పాటించడం లేదు. వారం రోజులుగా వైరస్​ తీవ్రత మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలో క్వారంటైన్ కేంద్రాలు పునరుద్ధరించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

corona cases increased day by day in nizamabad district
నిబంధనలు గాలికొదిలేశారు... వైరస్​ను ఆపలేకపోతున్నారు

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కరోనా తీవ్రత పెరుగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య అధికంగానే వస్తున్నాయి. కరోనా మొదటి దశలో కేసుల సంఖ్య వందకు చేరేందుకు మూడు నెలల సమయం పట్టింది కానీ... రెండో దశలో ఒకటి రెండు రోజుల్లోనే ఆ మార్క్ చేరుకుంటోంది. ప్రతి రోజూ వందకు చేరువలో కేసుల సంఖ్య నమోదవుతుండడంతో... అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఈనెల 1వ తేదీన 86 మందికి, 2వ తేదీన 83 మందికి, 3వ తేదీన 85, 4వ తేదీన 79, 5వ తేదీన 95, 6వ తేదీన 98 మందికి వైరస్ నిర్ధరణ అయింది. ప్రతి రోజూ 80కి తగ్గకుండా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

సరిహద్దులో మరీ ఎక్కువ..

కామారెడ్డి జిల్లాలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 6 తేదీ వరకు 872 మందికి కరోనా సోకింది. మంగళవారం ఒక్కరోజే 183 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. ప్రస్తుతం జిల్లాలో 902 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రను జిల్లా సరిహద్దు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో కేసుల తీవ్రత అధికంగా ఉంది. పక్క రాష్ట్రం నుంచి రాకపోకలు సాగించడంతో కేసులు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి.

నిబంధనలు పాటించక..

అధికంగా కేసులు వస్తున్నా ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు లేకుండానే తిరిగేస్తున్నారు. శానిటైజర్ వాడకం బాగా తగ్గిపోయింది. దీంతో కేసుల విస్తృతి అంతకంతకూ పెరుగుతోంది. మార్చి నెల ప్రారంభంలో పదిలోపే కేసుల సంఖ్య ఉండగా.. నిజామాబాద్ జిల్లాలో వందకు చేరువలో ఉంటే.. కామారెడ్డి జిల్లాలో ద్విశతకానికి దగ్గరలో ఉంది. సామూహిక కేసులు అధికంగా ఉంటున్నాయి. సంస్థలు, కార్యాలయాలు, పరిశ్రమల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అధికారులు నిర్ధరణ పరీక్షల సంఖ్యనూ గణనీయంగా పెంచారు. కరోనా తీవ్రత కారణంగా మళ్లీ ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలు పునరుద్ధరించేందుకు సన్నద్ధమవుతున్నారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో కరోనా తీవ్రతపై మంత్రి ఈటల సమీక్ష

ABOUT THE AUTHOR

...view details