సడలింపు ఉన్న సమయంలో చేసిన పండుగ ఆ ఊరిలో కలకలం రేపుతోంది. గ్రామంలో ఒక్క సారిగా కరోనా కేసులు పెరగడంతో గ్రామస్థుల్లో కలవరం మొదలైంది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కంఠం గ్రామంలో గడిచిన మూడు రోజుల్లో 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన ఓ కుటుంబం 'కందూరు పండుగ' నిర్వహించగా.. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న గ్రామం నుంచి బంధువులు వచ్చారు.
45కు వరకు కేసులు...
పండగా తరువాత అప్పటివరకు 1 లేదా 2 ఉన్న కేసులు ఒక్కసారిగా 45 వరకు చేరుకోవడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న గ్రామం నుంచి వచ్చిన బంధువుల వల్లే కేసులు పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. పండగ నిర్వహించిన కుటుంబ సభ్యుల్లో ఏడుగురికి వైరస్ సోకింది. వారికి వ్యాధి నిర్ధారణ కాకముందే... గ్రామంలో ఉపాధి హామీ పనికి వెళ్లడంతో గ్రామంలోని మిగతా వారికి కరోనా వ్యాప్తి చెందినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. దీంతో గ్రామాన్ని పూర్తి కంటోన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. పక్కనే ఉన్న ఐలాపూర్‌లో 12 కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.