Congress party leader D Srinivas resigned: ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో చేరిన 24 గంటల లోపే రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నిన్న గాంధీ భవన్‌లో చేపట్టిన నిరసన దీక్ష సందర్భంగా బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్, ఆయన కుమారుడు డి సంజయ్‌లు హస్తం పార్టీ కండువ కప్పుకున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే , పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిల సమక్షంలో ఇద్దరు కాంగ్రెస్ తీర్థం తీసుకున్నారు.
ఆ తరువాత ఏమి జరిగిందో తెలియదుకాని.. ఇవాళ మల్లిఖార్జున ఖర్గేకి డి శ్రీనివాస్ లేఖ రాశారు. తన కుమారుడు డి.సంజయ్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరిన సందర్భంగా ఆశీస్సులు ఇచ్చేందుకు గాంధీభవన్ వెళ్లినానని.. ఆ సందర్భంగా తనపై కండువా వేశారన్నారు. దీంతో తాను కూడా పార్టీలో చేరినట్లు మీడియా ప్రచారం చేసిందని వివరించారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినేనని కాని వయస్సు రీత్యా, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని వివరించారు. పార్టీలో తన చేరిక.. సంజయ్ టికెట్‌కు ముడి పెట్టొద్దని సూచించారు.
"నిన్న నా కుమారుడు సంజయ్ కాంగ్రెస్‌లో చేరాడు. సంజయ్‌తో పాటు నేను కూడా గాంధీభవన్ వెళ్లా. నాకు కండువా కప్పి పార్టీలో చేరినట్లు ప్రచారం చేశారు. నన్ను వివాదాల్లోకి లాగవద్దు. వయసు రీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నా. నేను కాంగ్రెస్‌లో చేరానని భావిస్తే రాజీనామా చేస్తున్నా"-డీ శ్రీనివాస్