తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​ డీసీసీబీ ఛైర్మన్​ పీఠం ఎవరిది? - నిజామాబాద్​ డీసీసీబీ ఛైర్మన్​ పీఠం ఎవరిది?

నిజామాబాద్ డీసీసీబీ ఛైర్మన్ అభ్యర్థులపై ఉత్కంఠ కొనసాగుతోంది. అత్యధిక సొసైటీలు కైవసం చేసుకుని డీసీసీబీ హస్తగతం చేసుకున్న తెరాస.. ఛైర్మన్ అభ్యర్థుల విషయంలో గోప్యత పాటిస్తోంది. డైరెక్టర్లంతా ఏకగ్రీవం కావడం వల్ల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అభ్యర్థులపై అందరి దృష్టి నెలకొంది. ఎక్కువ మంది బరిలో ఉండటం వల్ల అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. సీల్డ్ కవర్ లో ఎవరి పేరు వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

competition for nizamabad dccb chairman election
నిజామాబాద్​ డీసీసీబీ ఛైర్మన్​ పీఠం ఎవరిది?

By

Published : Feb 26, 2020, 4:33 AM IST

Updated : Feb 26, 2020, 8:12 AM IST

నిజామాబాద్​ డీసీసీబీ ఛైర్మన్​ పీఠం ఎవరిది?

ఉమ్మడి జిల్లాలోని 144 పీఏసీఎస్ ఛైర్మన్​లకు గాను 136 మంది తెరాస బలపరిచిన అభ్యర్థులు ఎన్నికవ్వడం వల్ల నిజామాబాద్ డీసీసీబీని తెరాస కైవసం చేసుకుంది. ఇప్పటికే డీసీసీబీ డైరెక్టర్లను తెరాస ఏకగ్రీవం చేసుకుంది. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం కావడం లాంఛనమే అయినా.. పీఠం అధిష్ఠించేది ఎవరనేది ఇంకా తేలలేదు. ఆశావహులు ఎవరికి వారు ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష స్థానంలో ఎవరు కూర్చుంటారన్నది చర్చనీయాంశంగా మారింది.

ఏకగ్రీవం

నిజామాబాద్ డీసీసీబీలో మొత్తం 20 మంది డైరెక్టర్లకు 19మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏ కేటగిరీలో 16 డైరెక్టర్ స్థానాలుండగా.. 15 మంది తెరాస మద్దతుదారులు డైరెక్టర్లుగా ఏకగ్రీవమయ్యారు. ఒక స్థానంలో రిజర్వేషన్ అభ్యర్థి లేకపోవడం వల్ల ఆ స్థానానికి తర్వాత ఎంపిక నిర్వహించనున్నారు. ఇక కేటగిరీ బీ లో నాలుగు స్థానాలుండగా.. ఒకే నామినేషన్ రావడం వల్ల అంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

డీసీఎంఎస్​ ఏకగ్రీవం

డీసీఎంఎస్​లో కూడా కేటగిరీ ఎ, బి లో మొత్తం 10 డైరెక్టర్ స్థానాలుండగా.. సింగిల్ నామినేషన్ దాఖలు కావడం వల్ల అంతా ఏకగ్రీవమయ్యారు. డైరెక్టర్లందరూ ఏకగ్రీవం కావడంతో డీసీసీబీ ఛైర్మన్ కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.

సభాపతి కుమారుడు

డీసీసీబీ పదవి తెరాసకు ఖాయమైనా అభ్యర్థి ఎవరనేది తేలడం లేదు. ప్రధానంగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి పేరు వినిపిస్తోంది. బాన్సువాడ మండలం దేశాయిపేట సొసైటీ నుంచి భాస్కర్ రెడ్డి ఛైర్మన్​గా రెండోసారి ఎన్నికయ్యారు.

అవే భాస్కర్​రెడ్డికి అనుకూలం

గత శాసనసభ ఎన్నికల్లో బాన్సువాడ నుంచి పోచారం విజయం సాధించిన తర్వాత.. మంత్రి పదవి ఇస్తారని భావిస్తే స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. తనకు మంత్రివర్గంలో అవకాశం దక్కలేదని.. డీసీసీబీ ఛైర్మన్ పదవి కుమారుడికి ఇవ్వాలని అధిష్ఠానానికి విన్నవించినట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఛైర్మన్ పదవి భాస్కర్ రెడ్డికి దక్కడం ఖాయం. క్రితంసారి నిజామాబాద్ ప్రాంతానికి ఛైర్మన్​ పదవి ఇచ్చినందున ఇప్పుడు కామారెడ్డికి చెందిన వ్యక్తికి ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా భాస్కర్ రెడ్డికి అనుకూలంగా ఉంది.

మరో ముగ్గురు

బోధన్ ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు డీసీసీబీ ఛైర్మన్ రేసులో ఉన్నారు. అమ్దాపూర్ సొసైటీ ఛైర్మన్​గా గెలుపొందిన గిర్దావర్ గంగారెడ్డి.. మాజీ ఎంపీ కవిత, జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్మూర్​ మండలం అంకాపూర్​ సొసైటీ ఛైర్మన్​గా గెలుపొందిన మార గంగారెడ్డి కూడా పోటీలో ఉన్నారు. కేసీఆర్​తో ఉన్న సాన్నిహిత్యం అవకాశం ఇస్తుందని భావిస్తున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే కుంట రమేష్ రెడ్డి డీసీసీబీ డైరెక్టర్​గా ఎంపికై అధ్యక్ష రేసులో ఉన్నారు.

ఎవరికి వారు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఛైర్మన్ పదవి ఎవర్ని వరిస్తుందో తెలియక ఉత్కంఠ నెలకొంది. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలందరూ ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Last Updated : Feb 26, 2020, 8:12 AM IST

ABOUT THE AUTHOR

...view details