తెరాస సర్కార్.. బంగారు తెలంగాణకు బదులు.. బిమారీ తెలంగాణగా తయారుచేసిందని.. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ రాష్ట్ర బాధ్యుడు తరుణ్‌చుగ్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధి మేడపాటి ప్రకాశ్‌రెడ్డి.. భాజపాలో చేరిన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
పసుపు రైతులకు మద్దతు కల్పించేందుకు కేంద్రం కృషి చేస్తోందని తరుణ్‌చుగ్ తెలిపారు. తెలంగాణ అభివృద్ధిపై కేసీఆర్ పట్టింపు లేదని.. కేవలం కుటుంబ సభ్యుల సంక్షేమమే ఆయన ధ్యేయమని విమర్శించారు. ఆత్మనిర్భర్ భారత్ కింద మౌలిక సదుపాయాలకు రూ.లక్ష కోట్లను కేంద్రం కేటాయించిందని చెప్పారు. మోదీ ప్రభుత్వం.. ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందిస్తుంటే.. కేసీఆర్ మాత్రం రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేంద్ర పథకాల పేర్లు మార్చి సొంత పథకాలుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. తొండి సంజయ్ అని తనపై కొందరు విమర్శలు చేస్తున్నారని... కానీ తాను తొడగొట్టే సంజయ్ అంటూ వేదికపై సంజయ్ తొడగొట్టారు.