తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆన్‌లైన్‌లో భవన నిర్మాణ అనుమతులు - building construction permissions in online

భవన నిర్మాణ అనుమతుల్లో వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడానికి పురపాలక శాఖ సమాయత్తమైంది. ఆన్‌లైన్‌లోనే నిర్మాణ అనుమతులు జారీ చేసేలా చేస్తున్న ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ‘టీఎస్‌-బీపాస్‌’గా పిలిచే ఈ విధానం జూన్‌ 2 నుంచి అమల్లోకి రానుంది.

building construction permissions will be available through ts bpass
ఆన్‌లైన్‌లో భవన నిర్మాణ అనుమతులు

By

Published : May 22, 2020, 10:24 AM IST

టీఎస్​ బీపాస్​ విధానంతో భవన నిర్మాణ అనుమతుల్లో వేగంగా సేవలు అందించడానికి పురపాలక శాఖ సన్నద్ధమైంది. జూన్‌ 2 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.

ఆన్​లైన్​లో అనుమతులు జారీ చేసే విధానం

  • 75 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లలో నివాస భవనాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. నామమాత్రంగా ఒక రూపాయి చెల్లించి తక్షణమే నిర్మాణ రిజిస్ట్రేషన్‌ ధ్రువపత్రం తీసుకోవచ్చు.
  • 75 చదరపు గజాల నుంచి 239.20 చదరపు గజాల లోపు గ్రౌండ్‌ ఫ్లోర్, మొదటి అంతస్తు వరకు (ఏడు మీటర్ల ఎత్తు ఉండే) నివాస భవనాలకు వెంటనే అమనుతి ఇవ్వనున్నారు. ఇందు కోసం స్థలానికి సంబంధించిన నిజ ధ్రువపత్రాలు, యజమాని చిరునామాకు సంబంధించిన పత్రాలు సమర్పించాలి.
  • 239.20 చదరపు గజాల నుంచి 598 చదరపు గజాల వరకు ప్లాట్లలో స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతులు రానున్నాయి.
  • 598 చదరపు గజాల కంటే ఎక్కువ.. గ్రౌండ్‌ ఫ్లోర్, 2 అంతస్తుల కన్నా ఎక్కువ ఉండే అన్ని నివాసేతర భవనాలకు సింగిల్‌ విండో విధానం ద్వారా అనుమతులు జారీ చేయనున్నారు.
  • టీఎస్‌-బీపాస్‌ అమలుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పురపాలక సంచాలకులు సత్యనారాయణ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కమిషనర్లను ఆదేశించారు.
    తప్పుడు సమాచారమిస్తే..
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలో తప్పుడు సమాచారమిస్తే భవన యజమానిపై చర్యలు తీసుకోవడంతో పాటు నిర్మించిన కట్టడాన్ని కూల్చేసే అధికారం ఉండేలా పురపాలక కొత్త చట్టంలో పొందుపర్చారు.
  • టీఎస్‌-బీపాస్‌ ద్వారా అనుమతులు తీసుకొని నిర్మిస్తున్న వాటిపై ప్రత్యేక బృందాల ద్వారా నిఘా పెట్టనున్నారు. నిఘా కమిటీకి జిల్లా పాలనాధికారి ఛైర్మన్‌గా ఉంటారు. నీటి పారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్‌ శాఖ జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు.
  • అనుమతుల కోసం సమర్పించిన ప్రణాళిక(ప్లాన్‌)కు విరుద్ధంగా నిర్మాణం చేపడితే నిఘా బృందం గుర్తించి సంబంధిత నివేదికలను పురపాలక కమిషనర్‌కు అందజేస్తారు. అనంతరం ఎలాంటి చర్య తీసుకోవాలనేది కమిటీ నిర్ణయిస్తోంది.
  • వీరికి తోడు టాస్క్‌ఫోర్స్‌ బృందం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఈ కమిటీకి పర్యవేక్షకులుగా ఎస్పీలు ఉంటారు. స్థానిక పోలీస్‌ అధికారులు సభ్యులుగా ఉండనున్నారు.

వారినేం చేస్తారో?

టీఎస్‌-బీపాస్‌ అమల్లోకి వస్తే పుర పాలక సంఘాల్లో పని చేసే టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందికి ఏ మాత్రం పని ఉండదు. భవన నిర్మాణాల అనుమతుల జారీ అంతా ఆన్‌లైన్‌లో జరగనుంది. లేఅవుట్ల క్రమబద్ధీకరణ సైతం జిల్లా పాలనాధికారి చూడనున్నారు. వారిని వేరే విభాగానికి పంపిస్తారా.. ఇతర సేవలకు వినియోగించుకుంటారా అనేది తేలాల్సి ఉంది.

21 రోజుల వ్యవధిలో

అంతర్జాలంలో tsbpass.telangana.gov.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి భవన నిర్మాణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్వీయ ధ్రువీకరణ(సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌) ఆధారంగా 21 రోజుల వ్యవధిలో భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తారు.

జూన్‌ 2 నుంచి అమల్లోకి..

టీఎస్‌-బీపాస్‌ విధానం జూన్‌ 2 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. 21 రోజుల్లోనే భవన నిర్మాణాల అనుమతులు జారీ కానున్నాయి. 75 లోపు చదరపు గజాల్లో ఇంటి నిర్మాణానికి అనుమతి అవసరం లేదు. దరఖాస్తు సమయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే కార్యాలయానికి వచ్చి నివృత్తి చేసుకోవచ్చు.

- జలేందర్‌రెడ్డి, డీసీపీ, నగర పాలక సంస్థ

ABOUT THE AUTHOR

...view details