BRS MLC Kavitha Fires on Bandi Sanjay : రాష్ట్రానికి బీజేపీ ఒరగబెట్టిందేం లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. పార్లమెంట్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై అక్కసు వెల్లదీస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాల్సిన ప్రజాప్రతినిధులు మాటలతో కాలయాపనా చేస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో తాను నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేసి గెలుస్తానని కవిత పేర్కొన్నారు. ప్రస్తుత ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కోరుట్ల పారిపోతున్నారని వ్యాఖ్యానించారు. గురువారం బీఆర్ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో ఎమ్మెల్యేలు గణేశ్ బిగాల, బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌లతో కలిసి మాట్లాడిన కవిత.. బీజేపీ, కాంగ్రెస్‌లను ఉద్దేశిస్తూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
MLC Kavitha fires on MP Arvind : నిజామాబాద్ తన అత్తగారి ఊరని.. నిజామాబాద్ జిల్లా దశమార్చబోతున్న ఐటీ హబ్(Nizamabad IT Hub)లో ఉద్యోగాల కల్పనపై ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడినవన్నీ అబద్దాలేననీ, సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరే స్థాయి ఆయనది కాదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. నిజామాబాద్ ఐటీ టవర్‌లో మొదటి రోజే 280 మందికి ఉద్యోగాలు వచ్చాయని.. అది చూసి ఉలిక్కిపడ్డ కాంగ్రెస్ నేతలు మహేశ్ కుమార్ గౌడ్, మధుయాష్కి గౌడ్ కూడా అక్కసు వెళ్లగక్కారన్నారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవదని.. ఐదు సీట్లనూ తామే గెలుస్తామని కవిత ధీమా వ్యక్తం చేశారు.
BRS MLC Kavitha Comments on Bandi Sanjay : పార్లమెంటులో బండి సంజయ్(Bandi Sanjay) విపరీతమైన అబద్దాలు చెప్పారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. తెలంగాణలో ఇరవై నాలుగు గంటల కరెంటు లేదన్న బండి సంజయ్.. బీజేపీ కార్యాలయం వద్ద విద్యుత్ తీగలు పట్టుకొని చూడాలని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో బండి సంజయ్ తమ నాయకుడిని వ్యకిగతంగా తిట్టడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. సీఎం కేసీఆర్‌కు భయపడి బీజేపీ, కాంగ్రెస్.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని కవిత ధ్వజమెత్తారు. తమ పార్టీ కాంగ్రెస్‌తో కలిసిందని బీజేపీ అంటుందని.. బీజేపీతో కలిసిందని కాంగ్రెస్ చెబుతుందని.. తమకు ఈ అనుభవం కొత్త కాదని స్పష్టం చేశారు. నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటై.. సిద్ధాంతాలను పక్కనబెట్టి కేసీఆర్‌పై వ్యక్తిగత ద్వేషంతో కలిసి పనిచేశాయని కవిత తెలిపారు.