Dharmapuri Srinivas Joined in Congress : బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. గాంధీభవన్ చేరుకున్న డి.శ్రీనివాస్, ఆయన పెద్ద కుమారుడు నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జీ మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో వారిద్దరూ పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా.. రాహుల్‌పై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ.. గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ నిరసన దీక్షలో పార్టీ రాష్ట్ర అగ్రనాయకులందరితో కలిసి డీఎస్ పాల్గొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా కీలక నేతగా వ్యవహరించిన డి.శ్రీనివాస్.. 2014 తర్వాత రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత రాజ్యసభ సీటు పొందారు. అనంతరం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం ఈ రాజ్యసభ స్థానం పదవీ కాలం కూడా ముగిసింది. గతంలోనే సోనియాను కలిసిన సందర్భంగా కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరిగినా అది జరగలేదు. ఇప్పుడు ఈ ప్రచారానికి ముగింపు పలుకుతూ.. తిరిగి తన రాజకీయ ప్రయాణాన్ని కాంగ్రెస్‌తోనే కొనసాగించాలని డి.శ్రీనివాస్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ గాంధీ భవన్‌కు చేరుకుని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తన ఆరోగ్యం బాగా లేకపోయినా.. వీల్‌ఛైర్‌లో డీఎస్ గాంధీ భవన్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఆయనతో పార్టీ నేతలు, శ్రేణులు పాత పరిచయం నెమరవేసుకుంటూ కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. అనంతరం శుభాకాంక్షలు తెలియజేశారు.