విధి ఎంత కఠినమైనదో... కష్టాలున్న వాళ్లనే గిల్లి మరీ బాధపెడుతుంది. లక్షల్లో ముగ్గురికి మాత్రమే వచ్చే వ్యాధి ఆ బాలునికి రావటం.. తన తండ్రి గుండె పోటుతో మరణించటం.. ఆ తర్వాత అనారోగ్యంతో తల్లి అనంతలోకాలకు వెళ్లటం.. జీవితం చరమాంఖంలో ఉన్న నానమ్మే తనకు దిక్కవటం.. ఇదీ నిజామాబాద్ జిల్లా బోధన్‌లో పదో తరగితి విద్యార్థి దయనీయ కథ.
అమ్మా, నాన్నలను కోల్పోయి...
బోధన్ పట్టణం తపాలా కార్యాలయం సమీపంలో నివసించే అబ్బవ్వకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రవి. రవి, లలిత దంపతులకు కుమారుడు దీపక్, కూతురు శ్రావ్య (గురుకులంలో 9వ తరగతి). పట్టణంలోని సామిల్లో రవి పని చేస్తూంటే... లలిత ఇంట్లోనే బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషించేవాళ్లు. ఉన్నదాంట్లో హాయిగా జీవనం సాగిస్తున్న వాళ్ల జీవితాలను విధి ఓ కుదుపు కుదిపింది. 2019లో గుండెపోటుతో రవి చనిపోగా... ఇంటి భాద్యతలు భార్య లలితపై పడ్డాయి. ఉపాధి కోసం గడప దాటింది. దుకాణాల్లో పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోసింది. కొడుకుకు చికిత్స చేయించలేకపోతున్నాననే బాధ.. ఇంటి పరిస్థితి దిగజారిపోతుందనే ఆందోళనలతో ఆకలినే మరిచిపోయింది ఆ తల్లి. క్రమంగా లలిత ఆరోగ్యం క్షీణించింది. ఆసుపత్రులకు తీసుకెళితే పేగులన్నీ ముసుకుపోయాయని.. బతకడం కష్టమని చెప్పారు. అలా.. లలిత కూడా 2021 మార్చి 8న కన్నుమూసింది. ఇద్దరు పిల్లలు మాత్రమే మిగలగా.. వారి బాధ్యతను నానమ్మ తీసుకుంది.
వెంటాడిన అనారోగ్యం...
ప్రస్తుతం మధుమలాంఛ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న దీపక్‌ను చిన్నప్పటి నుంచే అనారోగ్యం వెంటాడుతోంది. చివరకు జీవితకాలం వెంటాడే వ్యాధిగా తేలింది. ఐదేళ్ల ప్రాయంలోనే దీపక్‌కు డెంగీ సోకితే హైదరాబాద్‌కు తీసుకెళ్లి నయం చేయించుకొచ్చారు. అప్పుడే చాలా డబ్బులు ఖర్చు అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంతా బాగానే ఉంది అనుకునే సమయంలో... ముక్కులో నుంచి రక్తం కారడం మొదలైంది. ఏమిటా అని ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఎన్నో పరీక్షలు చేయించారు. పరీక్షలకు డబ్బులు లేక సతమతమవుతుంటే... స్థానిక కౌన్సిలర్ పద్మ కుటుంబం ద్వారా ఎమ్మెల్యే షకీల్‌ను సంప్రదించారు. ఎమ్మెల్యే వ్యక్తిగత ఆర్థిక సాయంతో హైదరాబాద్ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు, చికిత్స చేయించుకున్నారు. మూడేళ్ళ కిందట ఉపాధ్యాయురాలు సుధ కొన్ని పరీక్షలు చేయించారు.
అరుదైన వ్యాధిగా వెల్లడి...
చివరకు బాలుడికి సెంట్రల్ డయాబెటిక్ ఇన్సిపిడస్ (సీడీఐ) అనే అరుదైన వ్యాధి ఉందని గుర్తించారు. ఈ వ్యాధిలో మూత్రపిండాలను నియంత్రించే హార్మోన్‌ను విడుదల చేసే పిట్యూటరీ గ్రంథి దెబ్బతినడంతో సేవించిన నీరు శరీరానికి ఇంకకుండా నేరుగా మూత్రపిండాల ద్వారా బయటకు వెళుతుంది. తరచు దాహం కావడం, తిన్నది కూడా ఒంటికి పట్టకపోవడం జరుగుతుంది. మూత్రపిండాలను పనిచేయించాలంటే కృత్రిమంగా హార్మోను మాత్రలు వాడాలని వైద్యులు సిఫారసు చేశారు. ఈ లోపాలతో బాలుడిలో ఎదుగుదల నిలిచిపోయింది. ఇంకా చిన్న పిల్లాడి రూపమే కనిపిస్తోంది.