నిజామాబాద్ జిల్లా బోధన్ ఆసుపత్రికి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాతోపాటు ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు చెందిన గర్భిణులు వస్తున్నారు. వీరి పూర్తి ఆరోగ్య చరిత్ర లేకుండానే సేవలందించాల్సి రావడం యంత్రాంగాన్ని కలవర పెట్టిస్తోంది.
చేయాల్సింది ఇలా..
- మాతా, శిశు మరణాలను తగ్గించడానికి గర్భం దాల్చింది మొదలు ప్రసవమయ్యే వరకు వైద్య పరంగా పర్యవేక్షించడానికి అంగన్‌వాడీ, ఏఎన్‌ఎంల వద్ద నమోదు కార్యక్రమం అమలు చేస్తున్నారు. వీరి వైద్య రికార్డులను వెంటబెట్టుకొని ఆశా, ఏఎన్‌ఎంలు ఆస్పత్రికి తీసుకెళ్తే వైద్యులు పరీక్షించి ప్రసవ చికిత్సలు అందిస్తారు.
- బోధన్ ఆస్పత్రికి మే మాసంలో 355 ఈడీడీల జాబితా ఇచ్చారు. అందులో 186 కేసులు బోధన్ డివిజన్‌కు చెందినవి ఉన్నాయి. పొరుగు ప్రాంతాల నుంచి 44 మంది గర్భిణులు వచ్చారు.
అన్నీ సందేహాలే
- కొవిడ్-19 నేపథ్యంలో సాధారణ వైద్య సేవలను విస్మరించరాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక అవసరాల నేపథ్యంలో కొన్ని ప్రమాణాలను సూచించారు. వాటిని అనుసరించి సేవలు కొనసాగించాలని ఆదేశాలిచ్చారు.
- ప్రసవ తేదీ సమీపించిన, లేదా అత్యవసరంలో కాన్పు కోసం వస్తే తిప్పి పంపకుండా స్వాబ్ పరీక్షలు చేసి చికిత్సలకు అనుమతించాలనే నిబంధన ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
- గర్భిణులను ఆస్పత్రిలో చేర్చుకున్నాక వారి నుంచి స్వాబ్ సేకరించి పరీక్షలకు తరలించేదెవరు? వాటి నివేదికలు వచ్చేదెప్పుడన్న దానిపై స్పష్టత లేదని తెలుస్తోంది.
- ఒకవేళ పరీక్షలు చేయించినా నివేదిక వచ్చే వరకు చికిత్సలో జాప్యం చేస్తే ఇబ్బందులు తప్పవు. అందుకే పరీక్షలు లేకుండానే చికిత్సలు అందించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.