తెలంగాణ

telangana

ETV Bharat / state

అర్వింద్​ వర్సెస్ కవిత​... రాష్ట్రంలో హీటెక్కిన రాజకీయం!

bjp mp arvind vs mlc kavitha రాజకీయ విమర్శలు తెరాస, భాజపాల మధ్య ఉద్రిక్తతకు దారితీశాయి. తెరాస ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు ఫోన్‌ చేశారని ఆరోపిస్తూ నిజామాబాద్‌ భాజపా ఎంపీ అర్వింద్‌ చేసిన వ్యాఖ్యలపై తెరాస శ్రేణులు భగ్గుమన్నాయి. హైదరాబాద్‌లోని ఆయన ఇంటిపై తెరాస జెండాలు, కర్రలతో కొందరు శుక్రవారం ఉదయం దాడిచేశారు. ఇది గూండాయిజమేనని, సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌, కవితలు కుల అహంకారంతో దాడికి ప్రేరేపించారని ఎంపీ అర్వింద్‌ ఆరోపించారు. కవితపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు అర్వింద్‌ వ్యాఖ్యలను ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు.

bjp mp arvind vs mlc kavitha issue in telangana
అర్వింద్​ వర్సెస్ కవిత​... రాష్ట్రంలో హీటెక్కిన రాజకీయం!

By

Published : Nov 19, 2022, 7:59 AM IST

bjp mp arvind vs mlc kavitha రాజకీయ విమర్శలు తెరాస, భాజపాల మధ్య ఉద్రిక్తతకు దారితీశాయి. తెరాస ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు ఫోన్‌ చేశారని ఆరోపిస్తూ నిజామాబాద్‌ భాజపా ఎంపీ అర్వింద్‌ చేసిన వ్యాఖ్యలపై తెరాస శ్రేణులు భగ్గుమన్నాయి. హైదరాబాద్‌లోని ఆయన ఇంటిపై తెరాస జెండాలు, కర్రలతో కొందరు శుక్రవారం ఉదయం దాడిచేశారు. ఇది గూండాయిజమేనని, సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌, కవితలు కుల అహంకారంతో దాడికి ప్రేరేపించారని ఎంపీ అర్వింద్‌ ఆరోపించారు.

కవితపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు అర్వింద్‌ వ్యాఖ్యలను ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమన్నారు. ఇంకోసారి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్‌ చౌరస్తాలో చెప్పుతో కొడతామని హెచ్చరించారు. కాగా ఎంపీ ఇంటిపై దాడిని గవర్నర్‌ తమిళిసై ఖండించారు. డీజీపీ నుంచి నివేదిక కోరారు. భాజపా ముఖ్యనేతలు దాడిని తీవ్రంగా ఖండించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అర్వింద్‌కు ఫోన్‌చేసి పరామర్శించారు.

ఎంపీ అర్వింద్‌ ఇంటిపై దాడి:ఎంపీ ధర్మపురి అర్వింద్‌ నివాసంపై శుక్రవారం ఉదయం జెండాలు, కర్రలతో సుమారు 40-50 మంది తెరాస కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రోడ్‌ నంబరు-12, ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ ఇంటివద్దకు ఉదయం 9-10 గంటలకే ఆందోళనకారులు చేరుకున్నారు. జెండాలు, కర్రలు బయటకు కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. అందరూ ఒకచోటికి చేరాక 11-11.30 గంటల మధ్యలో మెడలో పార్టీ కండువాలు, జెండాలు, కర్రలతో కేకలు వేసుకుంటూ గుమికూడారు.

రాళ్లు, జెండాకర్రలు, పూలకుండీలతో అర్వింద్‌ ఇంటి అద్దాలను పగులగొట్టారు. పోలీసులు తేరుకొని అదుపులోకి తీసుకునే లోపే విధ్వంసం సృష్టించారు. అరుపులు, కేకలు, అర్వింద్‌కు వ్యతిరేకంగా నినాదాలతో దాదాపు అరగంట సేపు అక్కడ వాతావరణం భయానకంగా మారింది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను నెట్టుకొని ఆందోళనకారులు గేట్లు తీసి అర్వింద్‌ నివాసంలోకి దూసుకెళ్లారు. పడకగదితోపాటు మరో రెండుగదుల్లోకి వెళ్లి సామగ్రిని చిందరవందర చేశారు.

ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌ బృందం అతికష్టమ్మీద ఆందోళనకారులను అక్కడి నుంచి బయటకు పంపింది. అనంతరం తెరాస నేతలు, కార్యకర్తలు అర్వింద్‌ ఇంటి ముందు బైఠాయించారు. ఎంపీ అర్వింద్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నిరసనకారులను అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్సీ కవితను అర్వింద్‌ అవమానించారంటూ తొలుత తెరాస నేతలు రాజీవ్‌సాగర్‌, రాజారాంయాదవ్‌, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్‌ కవితారెడ్డి భర్త గోవర్ధన్‌రెడ్డి తదితరులు ధర్నా చేపట్టారు.

నేను పూజలో ఉన్నా:దాడి సమయంలో తాను పూజలో ఉన్నానని అర్వింద్‌ తల్లి విజయలక్ష్మి తెలిపారు. తాను బయటకు వచ్చే సరికి ఇదంతా జరిగిందన్నారు. ఆ సమయంలో అర్వింద్‌ ఇంట్లో లేరన్నారు. కవితపై అర్వింద్‌ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా ‘మాటలతో ఏమన్నా అవుతుందా? రాజకీయాల్లో అన్నీ ఉంటాయి. తప్పు చేయవద్దు. క్షమాపణ చెప్పేస్థాయికి దిగజారకూడదు’ అని అన్నారు.

ఎంపీ తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు:తమ నివాసంలో జరిగిన దాడి ఘటనపై శుక్రవారం సాయంత్రం ఎంపీ అర్వింద్‌ తల్లి డి.విజయలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌ తెలిపారు.దాడి ఘటనలో సుమారు 50 మంది పాల్గొన్నట్టు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 8 మంది తెరాస నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

అర్వింద్‌ నివాసంలోని సహాయకురాలిపై దాడికి పాల్పడినట్టు నిర్ధారణ కావటంతో 354 సెక్షన్‌ జతచేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎవరినీ అరెస్ట్‌ చేయలేదని, న్యాయనిపుణుల సలహా మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. పోలీసులు కూడా దాడిని నిలువరించలేకపోయారని ఎంపీ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్నారు

కవితపై ఎంపీ అర్వింద్‌ ఫిర్యాదు:ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అర్వింద్‌ శుక్రవారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కవిత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘వెంట పడి తంతాం.. చెప్పుతో కొడతాం, కొట్టి చంపుతాం’ అంటూ వ్యాఖ్యానించారని, 50 మంది తెరాస గూండాలు తన ఇంటిపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడికి ప్రేరేపించిన ఆమెపై సైతం కేసు నమోదు చేయాలని కోరారు.

అర్వింద్‌తో ఫోన్‌లో మాట్లాడిన అమిత్‌షా:రాష్ట్రంలో పరిణామాలు, ఎంపీ అర్వింద్‌ ఇంటిపై దాడి గురించి బండి సంజయ్‌ దిల్లీలో శుక్రవారం అమిత్‌షాకు వివరించారు. అనంతరం అమిత్‌షా అర్వింద్‌ను ఫోన్‌లో పరామర్శించారు. జరిగిన ఘటన గురించి ఎంపీని అడిగి తెలుసుకున్నారు. ఇంట్లోకి వెళ్లి ఇలా దాడులు చేయడం ఏంటి? దాడులు ఏంటి? ఇంట్లో మహిళలు, పిల్లలు ఉంటారు కదా? అని అమిత్‌షా అన్నట్లు భాజపా వర్గాల సమాచారం.

దాడిని ఖండించిన గవర్నర్‌..డీజీపీని నివేదిక కోరినట్లు వెల్లడి:హైదరాబాద్‌లో భాజపా ఎంపీ అర్వింద్‌ ఇంటిపై దాడిని గవర్నర్‌ తమిళిసై ఖండించారు. ఆస్తుల ధ్వంసంతో పాటు కుటుంబ సభ్యులను, పని మనుషులను భయపెట్టడం సరికాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని తెలిపారు. ఈ సంఘటనపై డీజీపీ నుంచి నివేదిక కోరినట్లు ఆమె శుక్రవారం ట్విటర్‌లో తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details