MP Aravind Latest Comments: తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ తరచూ వార్తల్లో నిలిచే నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మరోసారి తన మార్క్ చూపించారు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కవిత పట్ల సంజయ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్ధించబోనని అర్వింద్ స్పష్టం చేశారు. అలాగే కవిత ఈడీ విచారణపై ఆయన దిల్లీలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బండి సంజయ్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే మంచిదని ఎంపీ అర్వింద్ హితవు పలికారు. సంజయ్ వ్యాఖ్యలు బీఆర్ఎస్కు ఒక ఆయుధంగా మారాయన్నారు. సామెతలను జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదన్నారు. ఆయన వ్యాఖ్యలకు ఆయనే సమాధానం చెప్పాలన్నారు.
'కవిత పట్ల సంజయ్ చేసిన వ్యాఖ్యలను సమర్థించను. సంజయ్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే మంచిది. బండి సంజయ్ వ్యాఖ్యలకు బీజేపీకి సంబంధం లేదు. ఆయన వ్యాఖ్యలకు ఆయనే సమధానం చెప్పాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అంటే హోదా.. అది పవర్ సెంటర్ కాదు. అందరినీ సమన్వయం చేసుకునే బాధ్యత అది.'- ధర్మపురి అర్వింద్, బీజేపీ ఎంపీ
దర్యాప్తునకు కవిత సహకరించలేదు: కీలకమైన విచారణ జరుగుతున్న వేళ బీఆర్ఎస్ ఆందోళనలు చేయడం కంటే.. అధికారులు అడిగే ప్రశ్నలకు జవాబిస్తే బాగుంటుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత ఈడీ ఆఫీసులో ఉంటే రాష్ట్ర కేబినెట్ అంతా దిల్లీలో మకాం వేసిందని ఆరోపించారు. ఇదే చిత్తశుద్ది ప్రజల అభివృద్ధి మీద ఉంటే రాష్ట్రం బాగుపడేదని ధ్వజమెత్తారు. అవినీతిని అంతం చేయాలని మోదీ కంకణం కట్టుకున్నారన్న ఆయన.. కల్వకుంట్ల కుటుంబం అవినీతిలో మునిగితేలిందని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబం అంటరాని కుటుంబంగా నిలుస్తోందని అర్వింద్ వ్యాఖ్యానించారు.
'దర్యాప్తునకు కవిత సహకరించలేదని తెలిసింది. ఎందుకు, ఏమిటి, ఎలా అని ఈడీ అధికారులు అడిగితే... తెలవదు, గుర్తులేదు అని ఆమె సమాధానం చెప్పినట్టు తెలిసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేతికి 20లక్షల గడియారం, కోట్ల రూపాయల నగలు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు తెలుసు. ఈరోజు కల్వకుంట్ల కుటుంబం వల్లే జెంటిల్మెన్ మాగుంట ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడింది. పెద్ద సంస్థ అయిన అరబిందో సైతం ఇబ్బందులు ఎదుర్కొంటోంది.'- ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ ఎంపీ
కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని సమర్ధించను: ఎంపీ అర్వింద్ ఇవీ చదవండి: