తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ సమావేశం నిజామాబాద్ నగరంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఐఎఫ్టీయూ జాతీయ ఉపాధ్యక్షులు డీవీ కృష్ణ హాజరయ్యారు. బీడీ పరిశ్రమలో పని చేస్తున్న బీడీ కార్మికులు, టేకేదార్లు, ప్యాకర్స్, తదితరుల వేతనాలు, కూలీ రేట్లు పెంచాల్సి ఉన్నా యాజమాన్యాలు స్పందించకపోవడం సరైంది కాదన్నారు. అదేవిధంగా బీడీ కార్మికులకు సరిపడా పనిదినాలు కల్పించడం, ఆకు, తంబాకు, దారం అందించడంలో కార్మికులను ఇబ్బంది పెడుతున్నారన్నారు.
రేపటి నుంచి బీడీ కార్మికుల రాష్ట్రవ్యాప్త ఆందోళన - Beedi rollers in Telangana
బీడీ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు, కూలీ రేట్లు పెంచాలని యాజమాన్యాలను ఐఎఫ్టీయూ జాతీయ ఉపాధ్యక్షులు డీవీ కృష్ణ డిమాండ్ చేశారు. రేపటి నుంచి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు నిర్ణయించారు.

కూలీరేట్లు, వేతన ఒప్పందాల పెంపుదల, అమలుకై రేపటి నుంచి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నామన్నారు. ఈ పిలుపును బీడీ పరిశ్రమలోని అన్ని వర్గాల కార్మికులు జయప్రదం చేయాలని కోరుతున్నామన్నారు. ఈ సమావేశంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం, బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు భూమేశ్వర్, రాష్ట్ర కార్యదర్శులు వెంకన్న, ముత్తన్న, రాష్ట్ర నాయకులు రాజేశ్వర్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'ప్రభుత్వ భూమిలో ఉంటున్న వారికి త్వరలోనే పాసుపుస్తకాలు'